అందుకే సీబీఐ చేత విచారణ జరిపించాలి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి
యువగళంలో తన వెంట నడిచిన అనుచరులకు అడ్డగోలుగా ఉద్యోగాలు
నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చి నిబంధనల ఉల్లంఘన
మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ ధ్వజం
వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన
ఒంగోలు సబర్బన్: భారతదేశంలోనే అతిపెద్ద అవినీతి రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిందని రాష్ట్ర మాజీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాదిగ ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీలో జరిగిన అవినీతిపై సోమవారం కలెక్టరేట్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత అంబేడ్కర్ భవన్ నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వరకూ వచ్చారు. మధ్యలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసనలో కొమ్మూరి కనకారావు మాదిగ మాట్లాడుతూ మెగా డీఎస్సీలో అవినీతిపై తక్షణమే సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీలోని క్రీడల కోటాలో అతిపెద్ద అవినీతి చోటుచేసుకుందన్నారు. ప్రధాన క్రీడలను వదిలేసి తాడుపట్టి లాగే ఆటకు, పబ్జీకి కూడా క్రీడల కోటాకింద మెగా డీఎస్సీలో నియామకం చేయటం అత్యంత హాస్యాస్పదంగా ఉందన్నారు. యువగళంలో లోకేష్‌తో నడిచిన తన అనుచరులకు, తన సైన్యానికి మెగా డీఎస్సీలో ఉద్యోగాలు కల్పించేందుకు డీఎస్సీలోని నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ ఎంపికలో భారీ స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని మండిపడ్డారు. రిజర్వేషన్‌లో లేని ఆటలను చూపించి ప్రతిభ కలిగిన వారికి, ర్యాంకులు వచ్చిన వారికి తీవ్రంగా అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని విమర్శించారు. ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం దోచుకోవడం.. దాచుకోవడం..పంచుకోవటమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి యూనివర్శిటీ విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందన్నారు. చివరకు విద్యావ్యవస్థనే నిర్వీర్యం చేసే స్థాయిలో రాష్ట్రం దిగజారి పోయిందన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇవ్వటం దేశంలో ఎక్కడా ఈ రకంగా జరగలేదన్నారు. కళ్లుండీ చూడలేని చంద్రబాబు ప్రభుత్వం, నోరుండీ మాట్లాడలేని స్థితికి తీసుకెళ్లారంటే వీళ్ల అవినీతి, అరాచకాలు పెచ్చుమీరి పోయాయన్నారు. ప్రజలకు మేలు జరిగిన దాఖలాలు లేవని, కానీ రాష్ట్రంలో అప్పులు మాత్రం అనకొండలా పేరుకుపోతున్నాయని విమర్శించారు. అనంతరం మీ కోసం కార్యక్రమంలో ఉన్న కలెక్టర్ పి.రాజాబాబుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఉన్నం జనార్దన్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి యరిజర్ల రమేష్ బాబు, రాష్ట్ర కార్యదర్శి కందుల డానియెల్, సంయుక్త కార్యదర్శి దుడ్డు వినోద్, జిల్లా కార్యదర్శి రామారావు, ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు డి.రమణయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు మేళం గురవయ్య (మధు), జిల్లా ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు పాలెపోగు డగ్లస్, ఎస్సీ సెల్ దర్శి నియోజకవర్గ అధ్యక్షుడు జి.ఏసుదాస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, నాయకులు కరుణాకర్, యోహాను, పీటర్ అచ్చయ్య, కిరీటి తదితరులు పాల్గొన్నారు.
ర్యాంకర్లను, ప్రధాన క్రీడలను వదిలేసి తాడుపట్టి లాగే ఆట, పబ్జీలకు అవకాశం


