● జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షాలు
మార్కాపురం: మృగశిర కార్తె ప్రవేశంతోనే తొలకరి వర్షాలు మార్కాపురం జిల్లా ప్రజలను పలకరించాయి. జిల్లాలో 13 మండలాల్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకూ వర్షపు జల్లులు పడుతూనే ఉన్నాయి. దీంతో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధం కాగా గత 2 నెలల నుంచి తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడిన ప్రజానీకానికి తొలకరి జల్లులు హాయినిచ్చాయి. జిల్లాలో అత్యధికంగా రాచర్లలో 63.4 మి.మీ వర్షం కురవగా, తర్లుపాడు మండలంలో 34.8 మి.మీ, కంభంలో 28.6, కొమరోలులో 24, వైపాలెంలో 21.4, మార్కాపురంలో 11.6, పుల్లలచెరువులో 13.8 మి.మీ వర్షం పడింది. ఇంకా పెద్దారవీడు, పెద్దదోర్నాల, బేస్తవారిపేట, అర్ధవీడు, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. సోమవారం ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదయ్యాయి. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఖరీఫ్ సీజన్ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సజ్జ, జొన్న, కంది, ఆముదం, పత్తి పైర్లు వేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు రైతులు తమ పొలాలను దుక్కులు దున్నారు.
ఒంగోలు సబర్బన్: జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు సీడ్ బాల్స్(విత్తన బంతులు) వెదజల్లే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కలెక్టర్ పి.రాజా బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్‌లోని మీ కోసం పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం ఫారెస్ట్ అధికారులతో కలిసి సీడ్ బాల్స్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలంటే మొక్కలు, చెట్లు పెంచే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు. అందులో భాగంగా రిజర్వు ఫారెస్ట్ (రెగ్యులర్), సోషల్ ఫారెస్ట్ విభాగాల ద్వారా జిల్లా వ్యాప్తంగా 14 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. అందుకోసం నూతనంగా డ్రోన్ల ద్వారా కూడా ఈ సీడ్ బాల్స్‌ను రిజర్వు ఫారెస్ట్‌తో పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో వేస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద, పెద్ద పాఠశాలలను ఎంపిక చేసుకొని విద్యార్థుల ద్వారా కూడా ఈ సీడ్ బాల్స్ చేయించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. తద్వారా విద్యార్థులకు కూడా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు మొక్కలు పెంచే అలవాటును విద్యార్థి దశ నుంచే అలవాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రహరీలు ఉన్న పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నామన్నారు. వర్షాలు పడటం ప్రారంభమైన తరువాత సీడ్ బాల్స్ వెదజల్లుతారన్నారు. కార్యక్రమంలో రిజర్వు ఫారెస్ట్(రెగ్యులర్) డీఎఫ్‌ఓ కుట్టుబోయిన వినోద్ కుమార్, సోషల్ ఫారెస్ట్ డీఎఫ్‌ఓ కే.రాజశేఖర్, సబ్ డీఎఫ్‌ఓ టి.శ్రీనివాసులు, ఇన్‌చార్జి డీఆర్‌ఓ మాధురి, జెడ్పీ సీఈవో చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, ఫారెస్ట్ అధికారులు కే.శశి భూషన్ యాదవ్, పి.కరిముల్లాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


