గేమ్‌ ఛేంజర్‌..! | - | Sakshi
Sakshi News home page

గేమ్‌ ఛేంజర్‌..!

Jun 9 2026 9:04 AM | Updated on Jun 9 2026 9:04 AM

కందుకూరు రూరల్‌:

డపిల్ల అనగానే అవి చేయవద్దు.. ఇవి చేయవద్దు.. చక్కగా చదువుకో.. లేదా ఇంటి దగ్గరే ఉండు అని తల్లిదండ్రులు, బంధువులు చెబుతుంటారు. అందులోనూ క్రీడలంటే ఆడపిల్లలను పంపించడానికి అసలు ఇష్టపడరు. అలాంటింది.. ఒక ఆటలోనే కాకుండా నాలుగు ఆటల్లో నైపుణ్యం సాధించి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది కందుకూరుకు చెందిన పొనుగోటి మానస. హ్యాండ్‌బాల్‌, తైక్వాండో, సాఫ్ట్‌బాల్‌, కబడ్డీ క్రీడల్లో ప్రతిభ చూపింది. ప్రస్తుతం హ్యాండ్‌బాల్‌ ఇండియా టీమ్‌కు ఎంపికై ంది.

తైక్వాండోతో మొదలై...

కందుకూరులోని బృందావనంకు చెందిన పొనుగోటి రమేష్‌, చెన్నమ్మ దంపతులకు నలుగురు సంతానం. మూడో సంతానమైన పొనుగోటి మానసను ఆమె మేనత్త పెంచుకుంది. ఆమెకు మూడేళ్ల వయస్సులో బృందావనం పక్కనే ఉన్న టీఆర్‌ఆర్‌ కళాశాల క్రీడా మైదానంలో మాస్టర్‌ ఎస్‌కే అబ్దుల్‌ సలాం నేర్పించే తైక్వాండోలో మేనత్త భర్త చేర్పించారు. ఆనాడు మొదలైన క్రీడలపై ఆసక్తి అలాగే కొనసాగుతూ వచ్చింది. ఒకవైపు చదువుతూనే మరోవైపు తైక్వాండో క్రీడపై పట్టు పెంచుకుని బ్లాక్‌ బెల్ట్‌ సాధించింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పతకాలు కూడా సాధించింది. అదే సమయంలో పాఠశాల స్థాయిలో హ్యాండ్‌బాల్‌, కబడ్డీ, సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో పాల్గొంటూ సత్తాచాటుతూ వచ్చింది. మానస ప్రతిభను గుర్తించిన శాప్‌ అధికారులు 2019లో భద్రాచలంలోని ఆకాడమీలో చేర్పించారు. అక్కడ ఐదేళ్లపాటు హ్యాండ్‌బాల్‌లో శిక్షణ పొందింది. ఇంటర్‌, డిగ్రీ చదువుతూనే అకాడమీలో శిక్షణ పొందింది. హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ చూపి ఆంధ్రప్రదేశ్‌ తరఫున పతకాలు సాధించింది. మూడుసార్లు ఇండియా జట్టుకు ఎంపికై నప్పటికీ.. పాస్‌పోర్టు, ఇతర సమస్యల కారణంగా ఆడలేకపోయింది. ఈ ఏడాది మరోసారి ఇండియా జట్టుకు ఎంపికై ంది. ఈసారి కచ్చితంగా ఆడేందుకు పాస్‌పోర్టు, ఇతర సమస్యలేమీ లేకుండా సిద్ధం చేసుకుంటోంది. త్వరలో జరగబోయే అంతర్జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ఇండియా జట్టులో ఆడనుంది.

ఇప్పటి వరకు సాధించిన పతకాలు...

2017లో తెలంగాణలో జరిగిన 3వ సబ్‌ జూనియర్‌ జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం కై వసం చేసుకుంది. కేరళలో జరిగిన 14వ సీనియర్‌ జాతీయ స్థాయి సౌత్‌జోన్‌ చాంపియన్‌షిప్‌ ఉమెన్స్‌ పోటీల్లో బంగారు పతకం సాధించింది. 2018లో హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన 41వ జూనియర్‌ బాలికల జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో పాల్గొంది. 63వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జాతీయ స్థాయి బాలికల హ్యాండ్‌ బాల్‌, 2019లో ఢిల్లీలో జరిగిన 65వ జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో పాల్గొంది. 2020లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 41వ జూనియర్‌ బాలికల జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో బంగారు పతకం గెలుచుకుంది. 2021 ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 43 జూనియర్‌ బాలికల జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో సత్తాచాటింది. న్యూఢిల్లీలో జరిగిన 48వ జూనియర్‌ ఉమెన్స్‌ జాతీయ స్థాయి పోటీలు, 2023లో ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన 53వ సీనియర్‌ ఉమెన్స్‌ జాతీయ స్థాయి హ్యాండ్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. అలాగే వెస్ట్‌బెంగాళ్‌లో సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన పోటీల్లో బంగారు పతకం సాధించింది. వీటితోపాటు తైక్వాండోలో అనేక బంగారు పతకాలు సాధించింది.

క్రీడాకారులంటే సహజంగా వారికి ఆసక్తి ఉండి ఎంచుకున్న ఏదో ఒక ఆటలో శిక్షణ పొంది రాణించడం చూస్తుంటాం. కానీ, కందుకూరుకు చెందిన ఓ యువతి మాత్రం నాలుగు క్రీడల్లో రాణిస్తోంది. రెండు క్రీడల్లో జాతీయ స్థాయిలో సత్తాచాటుతోంది. మరో క్రీడలో ఏకంగా దేశం తరఫున ఆడేందుకు ఎంపికై ంది. దేశం కీర్తి ప్రతిష్టలు పెంచేలా ఆడతానని, ప్రతిభ చూపుతానని చెబుతోంది. తద్వారా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం సాధించాలనే తన కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

ఆటలు మారుస్తూ.. అన్నింట్లో రాణిస్తూ...

నాలుగు క్రీడల్లో సత్తా చాటుతున్న

కందుకూరు యువతి

హ్యాండ్‌బాల్‌ పోటీల్లో దేశం తరఫున

ఆడేందుకు ఎంపిక

తైక్వాండోలో బ్లాక్‌ బెల్ట్‌

సాఫ్ట్‌బాల్‌, కబడ్డీ పోటీల్లోనూ

జాతీయ స్థాయిలో రాణింపు

నా భర్త సహకారంతో స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం సాధిస్తా :

హ్యాండ్‌బాల్‌లో ఇండియా టీమ్‌కు ఇప్పటికే నాలుగుసార్లు ఎంపికయ్యాను. మూడుసార్లు ఆర్థిక పరిస్థితులు బాగా లేక కనీసం పాస్ట్‌పోర్టు తీసుకోలేక ఆగిపోయాను. ప్రస్తుతం నా భర్త కలవకూరి మనోజ్‌కుమార్‌ నాకు సపోర్టుగా ఉన్నారు. ఆయన సహకారంతో ఇండియా టీమ్‌లో ఆడేందుకు ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నా. అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నా. త్వరలో ఇండియా తరఫున ఆడనున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. బాగా ఆడి ఇండియాకు పేరు తీసుకురావాలని పట్టుదలతో ఉన్నా. ఆ తర్వాత స్పోర్ట్స్‌ కోటాలో రైల్వేలోగానీ, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోగానీ ఉద్యోగం సాధించాలని ఉంది. వివాహానికి ముందు ఎక్కడికై నా దూర ప్రాంతాలకు వెళ్లి ఆడాలంటే ఇబ్బందిగా ఉండేది. ప్రసుత్తం ఆ పరిస్థితి లేదు. నా భర్త అన్ని విధాలు ప్రోత్సహిస్తున్నారు. హ్యాండ్‌ బాల్‌ కోచ్‌, అధికారులు కూడా సహాయ సహాకారాలు అందిస్తున్నారు.

పొనుగోటి మానస

Advertisement
 
Advertisement
Advertisement