మార్కాపురం రూరల్: రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన వెల్లలచెరువు రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల ఓ గుర్తుతెలియని వ్యక్తి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాల పక్కన మృతిచెంది పడి ఉన్నాడు. నీలం రంగు జీన్స్ ప్యాంటు, తెలుపు రంగు పూల డిజైన్ చొక్కా ధరించి ఉన్నాడు. ఆదివారం ఉదయం మార్కాపురం నుంచి రైలు టికెట్ తీసుకుని ప్రయాణం ప్రారంభించినట్లు ప్రాథమిక సమాచారం మినహా ఇతర వివరాలేమీ లేవని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9247585720, 7013600365 నంబర్లను సంప్రదించాలని కోరారు.
చీమకుర్తి రూరల్: మండలంలోని రామచంద్రాపురం పంచాయతీ పరిధిలోని పుట్టచెరువుపాలెంలో సుంకర రమణయ్య ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. రమణయ్య ఒక పోర్షన్లో నిద్రిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ ద్వారా ఇంట్లోని రెండో పోర్షన్‌లోకి ప్రవేశించారు. బీరువా తెరిచి అందులోని నాలుగు సవర్ల బంగారం, 20 తులాల వెండి, రూ.10 వేల నగదు దొంగిలించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సోమవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రమణయ్య నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
అద్దంకి రూరల్: వివాహం కావడం లేదని మనస్తాపంతో ఓ యువకుడు గడ్డి మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం అద్దంకి మండలంలోని నాగులపాడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొప్పుల అంజి (25)కి వివాహం కాకపోవటంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో గడ్డి మందు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా పురుషుల జట్టు ఎంపిక సంతనూతలపాడు మండలం మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. సోమవారం మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుందరరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న క్రీడాకారులకు పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారితో జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఎంపికై న జట్టు ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరగబోయే రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి సుందర రామిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు చంద్రశేఖర్, రవి వెంకట్రావు, హాకీ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ తిరుమలశెట్టి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
మార్టూరు:ఆహార పదార్థాల విక్రయం, తయారీ విషయంలో నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని రీజినల్ విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. మార్టూరులో సోమవారం రాత్రి రీజినల్ విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. మొదట రవీంద్ర బేకరీలో రెండు శాంపిల్స్ సేకరించారు. అనంతరం ఇటీవల నూతనంగా ప్రారంభించిన శ్రీనివాస స్వీట్స్ అండ్ బేకరీ షాపును తనిఖీ చేశారు. జీఎస్టీ సర్టిఫికెట్‌తో వ్యాపారం చేయాలని సూచించారు. అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని తులసి సూపర్ మార్కెట్‌ను రాత్రి 7:30 గంటల వరకు అధికారులు తనిఖీ చేశారు. లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, గుంటూరు రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ కే చంద్రశేఖర్, తహసీల్దార్ లక్ష్మీమాధవి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.


