ఒంగోలు సబర్బన్: యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తాయని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా సాధన కార్యక్రమాలలో భాగంగా సోమవారం ఒంగోలులోని ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న రోడ్డులో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక తన క్యాంపు కార్యాలయం నుంచి నడుచుకుంటూ వచ్చి పాల్గొన్న కలెక్టర్.. యోగాసనాలు వేసి ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల్లో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ కోసం ప్రజలంతా యోగా సాధన చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 15 రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ మాధురి, జెడ్పీ సీఈవో చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ విజయలక్ష్మి, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఆయుష్ విభాగ సీనియర్ వైద్యులు భ్రమరాంబ, భీమ్‌నాథ్, డీఎస్‌డీవో రాజరాజేశ్వరి, ఇతర అధికారులు, పతంజలి యోగా సంస్థ గురువులు, ప్రజలు పాల్గొన్నారు. 45 నిమిషాల పాటు చేసే కామన్ యోగా ప్రొటోకాల్‌ను తెలిపే పోస్టర్‌ను మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఇతర అధికారులు ఆవిష్కరించారు.
యోగాతో సంతోషంగా జీవిద్దాం
మార్కాపురం టౌన్: యోగాతో ప్రతిఒక్కరూ ఆరోగ్యకర, సంతోకరమైన జీవితాన్ని పొందాలని మార్కాపురం కలెక్టర్ ఎం.విజయసునీత పిలుపునిచ్చారు. సోమవారం మార్కాపురంలోని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వేల సంవత్సరాల క్రితమే యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన భారత దేశం ఎంతో గొప్పదని అన్నారు. ఈ నెల 21 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 9న కంభం చెరువుకట్ట వద్ద యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే 17న త్రిపురాంతకంలోని ఆలయం వద్ద వెయ్యిమందితో యోగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నెల 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పెద్దఎత్తున యోగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యోగాలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిందని, కార్యక్రమాల్లో యువత, విద్యార్థులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ శివరామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజాబాబు


