కాచిగూడలో అదృశ్యమై.. సింగరాయకొండలో శవమై.. | - | Sakshi
Sakshi News home page

కాచిగూడలో అదృశ్యమై.. సింగరాయకొండలో శవమై..

Jun 9 2026 9:04 AM | Updated on Jun 9 2026 9:04 AM

కాచిగూడ/సింగరాయకొండ : ప్రేమ విఫలమైన నేపథ్యంలో హైదరాబాద్‌లోని కాచిగూడలో అదృశ్యమైన ఓ విద్యార్థి సింగరాయకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ బావిలో శవమై తెలాడు. ఈ సంఘటన వివరాలను కాచిగూడ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాజశేఖర్‌ సోమవారం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాకు చెందిన అంకం రాజేశ్వర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌లో యువకుడు అదృశ్యం కేసు నమోదు చేశారు. సైదాబాద్‌లోని లక్ష్మీకళ బాయ్స్‌ హాస్టల్లో ఉంటున్న అంకం రాజేశ్వర్‌ కుమారుడు అంకం రాహుల్‌ (21) బీటెక్‌ చదువుతున్నాడు. తన స్నేహితుడి మోటార్‌ సైకిల్‌పై కాచిగూడ టూరిస్ట్‌ హోటల్‌ జంక్షన్‌ వరకు గత నెల 27వ తేదీ వచ్చాడు. అక్కడ బైక్‌ దిగి తాను స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నానని చెప్పాడు. అప్పటి నుంచి రాహుల్‌ కనిపించకుండా పోయాడు. అదృశ్యం కేసు నమోదు చేసిన కాచిగూడ పోలీసులు అన్నికోణాల్లో గాలించి ఆధారాలు సేకరించారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి రైలెక్కి ఒంగోలు వెళ్లిపోయాడని తెలుసుకున్నారు. ఏపీ పోలీసులు, తండ్రి రాజేశ్వర్‌, కుటుంబ సభ్యులు ఒంగోలులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీ దర్యాప్తు బృందానికి కీలక సమాచారం లభించింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఒక బావిలో గత నెల 30వ తేదీ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని, దానిపై అక్కడ కేసు నమోదైందని పోలీసులు తెలుసుకున్నారు. సింగరాయకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్న మృతదేహం వద్ద లభించిన వస్తువులు, ఇతర ఆధారాలను పరిశీలించారు. అవన్నీ అదృశ్యమైన విద్యార్థి అంకం రాహుల్‌ వివరాలతో సరిపోయాయని పోలీసులు తెలిపారు. ఈ సమాచారాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అధికారికంగా అందించిన కాచిగూడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ప్రేమ విఫలమైన విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి

ఓ పాడుబడిన బావిలో మృతదేహం లభ్యం

Advertisement
 
Advertisement
Advertisement