న్యూస్‌రీల్
గ్రానైట్ క్వారీల్లో నిబంధనలు, భద్రతా చర్యలకు నీళ్లొదిలేసిన యాజమాన్యాలు
మండుఎండల్లోనూ, రాత్రి వేళ కార్మికుల చేత పనులు
నైపుణ్యం లేని వారితో పనులు
రిజిస్టర్లలో మాత్రం అర్హత ఉన్నవారి పేర్లతో అధికారుల కళ్లకు గంతలు
యాజమాన్యాల నిర్లక్ష్యంతో తరచూ ప్రమాదాలు
నామ మాత్రపు తనిఖీలతో సరిపుచ్చుతున్న అధికారులు
బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ఉన్న గ్రానైట్ క్వారీల్లో నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. క్వారీల యాజమానుల ఇష్టారాజ్యంగా సాగుతోంది. కనీస భద్రతా చర్యలు తీసుకోకుండా గ్రానైట్ తవ్వకాలు సాగిస్తూ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అనుమతులు లేకున్నా రాత్రిపూట కూడా తవ్వేస్తున్నారు. తక్కువ వేతనాలకు వచ్చే నైపుణ్యం లేని కార్మికులతో పనులు చేయిస్తున్నారు. మైన్స్ సేఫ్టీ అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మైన్స్ సేఫ్టీ అధికారులు నిత్యం క్వారీలను తనిఖీ చేయాలి. ప్రమాదం సంభవించినప్పుడు మాత్రమే వీరంతా క్వారీలకు వచ్చి హడావుడి చేస్తుంటారు. మిగిలిన సమయాల్లో క్వారీల వైపు కన్నెత్తి కూడా చూడరు. క్వారీల్లో జరిగే భద్రత వారోత్సవాలకు సైతం గురిజేపల్లి, చీమకుర్తి, బల్లికురవ క్వారీల్లో పని చేసే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మేనేజర్లనే టీములుగా నియమించుకోవడం వల్ల అంతా బాగున్నాయనే కితాబిచ్చి వెళుతుంటారు.
మూడు నెలలుగా ఎండలు, వడ గాల్పుల ఉధృతి అధికంగా ఉంది. ఉదయం 10 గంటలకే 45 డిగ్రీల ఉష్ణోగ్రత వడగాల్పుల ఉధృతి నమోదవుతోంది. ఈ పరిస్థితుల్లో కార్మికులు తలకు గుడ్డలు, టోపీలు పెట్టుకొని మధ్యాహ్నం 12 గంటల సమయంలోను పనులు చేస్తున్నారు. క్వారీల్లో రాయి తీయగా ఏర్పడిన గుంటల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరింది. ఆ గుంటల చుట్టూ కార్మికుల చేత పనులు చేయిస్తుండటంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
బెంచ్ కటింగ్ నిబంధనలు ఏ క్వారీలోనూ పాటించడం లేదు. పైనుంచి క్వారీని తొలిచే క్రమంలో ఒక్కో వరుసలో ఏడు మీటర్ల వెడల్పు వదిలి పనులు చేయాలి. అలా చేస్తే నష్టపోవాల్సి వస్తుందని గ్యాప్ లేకుండానే పనులు చేయించడం వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు 3న ఈర్లకొండ సత్యకృష్ణ క్వారీలో పైనుంచి పెద్ద బండరాయి దొర్లి డ్రిల్లింగ్ చేస్తున్న కార్మికులపై పడటంతో పదిమంది పైగా మృత్యువాత పడ్డారు. ఒకళ్లిద్దరు చనిపోతే పాము కరిచింది అంటూ నమ్మించి గుట్టు చప్పుడు కాకుండా సెటిల్ చేయడం ఇక్కడ ఆనవాయితీ.
నిబంధనలు కల్ల..


