ఆన్‌లైన్‌ పార్శిల్స్‌...అదుర్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ పార్శిల్స్‌...అదుర్స్‌

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

నలుమూలలకు చేరుతున్న ఉలవపాడు మామిడి భారీగా పెరిగిన ఆన్‌లైన్‌ వ్యాపారం బస్సులు, లారీలు, మినీ వాహనాల్లో తరలింపు

ఉలవపాడు: మామిడి వ్యాపారం కొత్తపుంతలు తొక్కుతోంది. గతంలో ఉలవపాడు మామిడి కాయలు కావాలంటే ఉలవపాడు ప్రాంతానికి రావాల్సిందే. లేదంటే బంధువుల ద్వారా తీసుకెళ్లేవారు. కానీ కాలం మారింది... ఇప్పుడు ఫోన్‌ చేస్తే చాలు నేరుగా వారి వద్దకే పార్శిల్స్‌ అందించే పరిస్థితి వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఉలవపాడు మామిడి కాయలు ఇప్పుడు పార్శిల్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా నలుమూలలకు చేరుతున్నాయి. గత నాలుగేళ్లుగా ఈ వ్యాపారం జరుగుతున్నా ఈ ఏడాది మాత్రం అధిక శాతం పార్శిల్స్‌ ద్వారా మామిడికాయలు తరలివెళుతున్నాయి. ప్రస్తుతం ఉలవపాడు ప్రాంతంలో ఈ ఆన్‌లైన్‌ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. మండల పరిధిలోని కార్గో సెంటర్లు, తెలంగాణ కార్గో సెంటర్లు, ప్రైవేటు ట్రావెల్స్‌ ఆఫీసుల వద్ద ఎక్కడ చూసినా మామిడికాయల బాక్స్‌లు దర్శనమిస్తున్నాయి. రోజుకు సుమారు 2 వేల బాక్స్‌లు పైనే తరలివెళుతున్నాయి. సాయంత్రం అయితే చాలు కాయలు బాక్స్‌లు పంపేవారితో సందడిగా మారుతోంది. ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా మామిడికాయలు పంపించడానికి చాలా మంది వ్యాపారులు తమ ఫోన్‌ నంబర్లు పెడుతున్నారు. వారికి ఫోన్‌ చేసి ఆర్డర్‌ ఇస్తే వారు పార్శిల్స్‌ పంపిస్తున్నారు. యూపీఐ ద్వారా నగదు పంపిస్తున్నారు. ప్రస్తుతం అధిక శాతం మంది మామిడి ప్రియులు ఈ ఆన్‌లైన్‌ పార్శిల్స్‌ ద్వారా మామిడిని దిగుమతి చేసుకుంటున్నారు. మామిడి వ్యాపారులకు సైతం ఈ ఆన్‌లైన్‌ వ్యాపారం లాభసాటిగా ఉంది.

నలుమూలలకూ ఉలవపాడు మామిడి..

ప్రస్తుతం ఉలవపాడు మామిడి నలుమూలలకు చేరుతోంది. ప్రస్తుతం ఉలవపాడు ప్రాంతం నుంచి హైదరాబాద్‌, విశాఖపట్నం, ముంబాయి, కోల్‌కత్తా, భువనేశ్వర్‌, తిరుపతి, విజయవాడ, గుంటూరు తోపాటు తెలంగాణలోని అన్ని పట్టణాలకు ప్రస్తుతం పార్శిల్స్‌ పంపిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ట్రావెల్స్‌ బస్సుల్లో ఈ పార్శిళ్లు పంపిస్తున్నారు. ఈ వాహనాలు సరిపోక కార్గో ఏజంట్లు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటుచేసి డోర్‌ డెలివరీ చేస్తున్నారు. ఉలవపాడు మామిడి ఇప్పుడు దేశవ్యాప్తంగా డోర్‌ డెలివరీ ద్వారా అందుతున్నాయి.

ఆన్‌లైన్‌ వ్యాపారం అదుర్స్‌..

ప్రస్తుతం ఆన్‌లైన్‌ వ్యాపారం భారీగా జరుగుతోంది. ఉలవపాడు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన దుకాణదారులందరూ ఆన్‌లైన్‌ ద్వారా కాయలు పంపుతున్నారు. వాహనదారులు ఈ దుకాణాల వద్దకు వచ్చి కొనుగోలు చేసే సమయంలో వారి నంబర్లు తీసుకుని పంపాలని కోరుతున్నారు. వారు బాక్స్‌ల్లో అందంగా ప్యాక్‌ చేసి కాయలు పంపిస్తున్నారు. ఇక ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా కూడా కొందరు వ్యాపారులు తమకు ఫోన్‌ చేస్తే కాయలు పంపిస్తామని తెలియజేస్తున్నారు. వారి ద్వారా కూడా ఆన్‌లైన్‌ వ్యాపారం నడుస్తోంది. గత నాలుగేళ్లుగా ఇలానే పార్శిళ్లు వేస్తున్నా ఈ ఏడాది ఆన్‌లైన్‌ ద్వారా మామిడి కాయలు పంపించడం బాగా అధికమైందని మామిడి వ్యాపారులు అంటున్నారు. మామిడి కాయల ప్యాకింగ్‌ బాక్స్‌లు కూడా దొరకని పరిస్థితి ఉంది. సాధారణ సమయంలో రూ.50 ఉండే అట్ట బాక్స్‌ ప్రస్తుతం రూ.200కు అమ్ముతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా పంపించేవి పచ్చి కాయలు ఉండాలి కాబట్టి రేటు కూడా అధికంగా ఉంది. అందువలన మామిడి రైతులు సైతం ఆన్‌లైన్‌ ద్వారా పంపడమే మేలనుకుంటున్నారు. ప్రస్తుతం బంగినపల్లె రకం కేజీ రూ.100 చొప్పున ఆన్‌లైన్‌ అమ్మకాలు సాగిస్తున్నారు. అట్టపెట్టెలు, రవాణా చార్జీలు అధికంగా ఉంటాయి. ఇలా ప్రస్తుతం ఉలవపాడులో ఆన్‌లైన్‌ ద్వారా వ్యాపారం భారీగా జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement