మళ్లీ గ్యాస్‌ బండ | - | Sakshi
Sakshi News home page

మళ్లీ గ్యాస్‌ బండ

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

గ్యాస్‌ సిలిండర్‌పై రూ.29 పెరుగుదల పెరిగిన గ్యాస్‌ ధరలతో బెంబేలెత్తుతున్న ప్రజలు మార్చి 7న రూ.60 పెరుగుదల రూ.987కు చేరిన వంట గ్యాస్‌ సిలిండర్‌ జిల్లా ప్రజలపై సుమారు రూ.2 కోట్ల అదనపు భారం

మార్కాపురం: ఇరాన్‌, అమెరికా యుద్ధం ప్రజలపై పెనుభారం మోపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7న వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.60 పెంచగా, ఆదివారం మళ్లీ రూ.29 పెంచడంతో సిలిండర్‌ ధర రూ.987 కు చేరింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలపై నెలకు సుమారు రూ.2 కోట్ల అదనపు భారం పడుతోంది. ఉమ్మడి జిల్లా మొత్తం మీద 7,03,090 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.29 పెరగడంతో జిల్లా వ్యాప్తంగా రూ.2,03,89,610 అదనపు భారం పడుతోంది. 14.2 కిలోల గృహ వినియోగదారులకు కేంద్రం గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తోంది. సిలిండర్‌ బుక్‌ చేసుకునే వ్యవధిని గ్యాస్‌ ఏజెన్సీలు 45 రోజులకి పెంచాయి. అంటే ఒక సిలిండర్‌ బుక్‌ చేసుకున్న 45 రోజుల తరువాతే మరో సిలిండర్‌ను బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. గతంలో బుక్‌ చేసుకున్న 3వ రోజే గ్యాస్‌ డెలివరీ అయ్యేది. యుద్ధం కారణంగా గ్యాస్‌ కొరత ఏర్పడటంతో గ్యాస్‌ ఏజెన్సీలు గ్యాస్‌ బుకింగ్‌ సమయాన్ని పెంచాయి. ఇదే సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, నూడిల్స్‌ బండ్లు, టీ షాపుల వారు కమర్షియల్‌ సిలిండర్‌ ధర ఎక్కువగా ఉండటం, బ్లాక్‌ మార్కెట్‌లో కూడా అధిక ధర ఉండటంతో డొమెస్టిక్‌ సిలిండర్లను వ్యాపార అవసరాలకు వాడుతున్నారు. ఇటు డొమెస్టిక్‌, అటు కమర్షియల్‌ సిలిండర్ల ధరలు రెండూ పెరిగిపోతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కమర్షియల్‌ సిలిండర్ల ధరల పెరుగుదల ఇలా..

ఈ ఏడాది ఫిబ్రవరి 27 వరకూ కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.1932 ఉండగా మార్చి 4న రూ.31 పెంచడంతో రూ.1963కు చేరింది. మార్చి 12న మరో రూ.114 పెరగడంతో రూ.2077కు చేరింది. ఏప్రిల్‌ 2న మళ్లీ రూ.196 పెంచడంతో రూ.2273 అయింది. మళ్లీ ఇటీవల రూ.993 పెంచడంతో రూ.3266కు చేరింది. ఇదే సమయంలో కొరత కూడా ఎక్కువగా ఉండటంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీ, టీ స్టాల్స్‌, స్వీట్‌ షాపుల యజమానులు పల్లెలకు వెళ్లి బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు. ఆ భారాన్ని తమపై లేకుండా వినియోగదారులపైనే వేస్తున్నారు. దీంతో మొత్తం ధరలను వ్యాపారులు పెంచారు.

ఇబ్బందిగానే ఉంది:

గృహ అవసరాల సిలిండర్‌ ధరల పెంపుదల అందరికీ భారమే. సిలిండర్‌ లేనిది వంటింట్లో ఏపనీ కాదు. కాఫీ తాగాలన్నా.. వంట చేయాలన్నా.. సిలిండర్‌ అవసరమే. ఇటువంటి పరిస్థితుల్లో ఆదివారం నుంచి రూ.29 ధర పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ ఇబ్బందిగానే ఉంది.

– పి.విజయలక్ష్మి, గృహిణి, మార్కాపురం

ఉమ్మడి జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్లు

7,03,090

మార్కాపురం జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్లు 3,22,279

Advertisement
 
Advertisement
Advertisement