రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి విద్యాశాఖ వత్తాసు | - | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి విద్యాశాఖ వత్తాసు

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

విద్యాశాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సింగరాయకొండ: ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థ తన వ్యాపార ప్రచారం కోసం ఆలిండియా ఆల్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ అని చెప్పి పదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలకు ఎన్టీఆర్‌ అవార్డుల పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వద్ద పెట్టిన కార్యక్రమానికి విద్యాశాఖ వత్తాసు పలికి అభాసుపాలైందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారి అధికారికంగా ఎంఈఓలకు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. దీంతో ఎంఈఓలు ఆ సమాచారాన్ని ఉపాధ్యాయుల వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేయటంతో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఈ అవార్డు కార్యక్రమానికి ఎంతో ఆశతో వెళ్లి.. చివరికి ఇది ప్రభుత్వ అధికారిక అవార్డు ఫంక్షన్‌ కాదని, ఇది కేవలం రియల్‌ ఏస్టేట్‌ వెంచర్‌ పబ్లిసిటీ కార్యక్రమం అని తెలిసి నిశ్చేష్టులయ్యారన్నారు. దీనిని బట్టి విద్యాశాఖ టీడీపీ తొత్తుగా ఏవిధంగా పనిచేస్తుందో అర్థమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి నారాలోకేష్‌, నందమూరి బాలకృష్ణ, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని కరపత్రికను రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారి విడుదల చేశారని ఆరోపించారు. ఈ సమాచారాన్ని డీఈఓ ఎలా నమ్మారో, లేదా రియల్‌ఏస్టేట్‌ వ్యాపారి ప్రలోభానికి లొంగారో తెలియదు కానీ డీఈఓ అధికారికంగా మెసేజ్‌లు పెట్టారన్నారు. తీరా ఆ కార్యక్రమం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి సంబంధించిన వెంచర్‌ ప్రచారంలో భాగమని తెలిసి అధికారులంతా ఎవరికి వారు తేలుకుట్టిన దొంగల్లాగా చల్లగా జారుకున్నారని విమర్శించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి సహకరించిన విద్యాశాఖాధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఘటనను బట్టి విద్యాశాఖ మీద ఎవరికీ పట్టులేదనేది తేటతెల్లమవుతోందని, దీనికి విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వ్యవస్థలన్నీ రాజకీయమయం అయ్యాయనటానికి ఇది నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల కు చెందిన దాదాపు 5 వేలకు పైగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భారీగా హాజరయ్యారని, వీరికి ప్రశంసపత్రాలు, షీల్టు ఇస్తామని నానా హంగామా చేశారని చివరికి అక్కడ మాత్రం సమాచారం ఇచ్చేవారే కరువవటంతో కార్యక్రమం రసాభాసగా మారిందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారన్నారు. ఈ ఘటనలో విద్యాశాఖలోని ప్రతి ఒక్కరి పాత్ర ఉందని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement