ఈ జాప్యం.. దోపిడీ కోసం! | - | Sakshi
Sakshi News home page

ఈ జాప్యం.. దోపిడీ కోసం!

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

మార్కాపురం:

చెరువుల మరమ్మతు పనులపై నీలినీడలు అలుముకున్నాయి. వాటాల లెక్క తేలకపోవడంతో పనులకు సంబంధించిన టెండర్ల ఖరారులో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడిచిన రెండేళ్ల వ్యవధిలో వర్షాలు కురిసినా చెరువులకు సక్రమంగా నీరు చేరలేదు. నిండు కుండలా మారిన చెరువులు సైతం తూముల లీకేజీలతో ఒట్టిపోయాయి. ఈ నేపథ్యంలో చెరువులను బాగు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తుండగా చంద్రబాబు సర్కారు రెండేళ్ల తర్వాత ఆలస్యంగా స్పందించింది. జల సంరక్షణ పేరుతో హడావుడి చేస్తోందో తప్ప ఆచరణలో మాత్రం ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్టు పరిస్థితి తయారైంది. జిల్లాలోని వివిధ చెరువుల మరమ్మతులకు ఇటీవల ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తవుతాయన్న నమ్మకం రైతుల్లో కలగడం లేదు.

జిల్లాలోని 22 చెరువులకు ఆర్‌ఆర్‌ఆర్‌(రిపేర్‌ రెనోవేషన్‌ రీస్టోరేషన్‌) కింద 13.47 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ, అభివద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు ఓఅండ్‌ఎమ్‌(ఆపరేషన్‌ అండ్‌ మెయింటెన్స్‌) కింద 42 వర్కులకు గాను 3.32 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. వీటితో చెరువులు, చెరువు కాలువల మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని పనులకు టెండర్లు పిలవగా, మరికొన్ని పనులకు టెండర్‌ ప్రక్రియ ప్రారంభించలేదు. మరికొన్ని పనులకు కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్‌ చేసుకోవాల్సి ఉంది. నీటి పారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య పర్సెంటేజీల విషయమై పొత్తు కుదరకపోవడంతో పనులకు బ్రేక్‌ పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ పరిణామం ఆయకట్టు రైతులకు ఇబ్బందికరంగా మారింది.

రూ.10 లక్షల్లోపు పనులు పచ్చ నేతలకే..

చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరు కాగానే టీడీపీ, జనసేన నాయకుల్లో కొందరు పనులు దక్కించుకునేందుకు పావులు కదిపారు. వర్క్‌ ఆర్డర్ల కోసం నియోజకవర్గ ముఖ్య నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. 10 లక్షల రూపాయల లోపు పనులను నామినేషన్‌ పద్ధతిపై నీటి సంఘాలకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించడం కూటమి నాయకులకు ఆర్థికంగా మేలు చేయడం కోసమేనన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మార్కాపురం చెరువుకు రూ.1.17 కోట్లు యర్రగొండపాలెం చెరువుకు రూ.43 లక్షలు, దూపాడు చెరువుకు రూ.66.50 లక్షలు, బద్వీడు చెరువుకు రూ.51 లక్షలు, పెద్దబొమ్మలాపురం చెరువుకు రూ.4.92 కోట్లు, బోడపాడు బంధంవాగుకు రూ.23 లక్షలు, బోడిరెడ్డిపల్లి చెరువుకు రూ.46.50 లక్షలు, కొలుకుల చెరువుకు రూ.27 లక్షలు, పెద్దనాగులవరం చెరువుకు రూ.22.50 లక్షలు, త్రిపురాంతకం చెరువుకు రూ.39 లక్షలు కేటాయించారు. కనిగిరి నియోజకవర్గంలోని హనుమంతునిపాడు చెరువుకు ఓఅండ్‌ఎమ్‌ పథకం కింద రూ.2 కోట్లు, కంభం, బేస్తవారపేట, అర్ధవీడు, రాచర్ల, తర్లుపాడు చెరువులకు నిధులు మంజూరయ్యాయి. చిన్నాచితక పనుల సంగతి అటుంచితే భారీ మొత్తంలో నిధులు మంజూరైన చెరువులకు సంబంధించిన పనులు అప్పగించేందుకు కాంట్రాక్టర్లతో టీడీపీ నేతలు బేరాలు ఆడుతున్నట్లు సమాచారం.

ఆయకట్టు సాగు ప్రశ్నార్థకం

చెరువుల మరమ్మతు పనులు ఇప్పటికే దాదాపు పూర్తి చేయాల్సి ఉంది. నిధులు మంజూరైన వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి ఉంటే వేలాది ఎకరాల భూములకు సాగునీరు సక్రమంగా అందేది. జూన్‌ 2వ వారం నుంచి ఖరీఫ్‌ సీజన్‌, వర్షాకాలం ప్రారంభం కానుంది. ఇంత వరకు పనులే ప్రారంభించకపోవడంతో ఈ ఏడాది చెరువుల మరమ్మతులు పూర్తి చేయడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మార్కాపురం చెరువులో సుమారు 7 నుంచి 8 అడుగుల మేర పూడిక పేరుకుపోయింది. చెరువుతోపాటు కాలువల్లో కూడా చిల్లచెట్లు భారీగా మొలిచాయి. కొద్దిపాటి వర్షానికే చెరువు నిండి నీరు వృథాగా పోతోంది. గిద్దలూరు నియోజకవర్గంలో పలు చెరువులకు గతంలో పడిన గండ్లు పూడ్చడంలో అలవిమాలిన జాప్యం చేయడం, పామూరు, పీసీపల్లి, రాచర్ల తదితర మండలాల పరిధిలోని చెరువుల తూములకు షట్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

చెరువుల మరమ్మతులు ఈ ఏడాది కష్టమే!

వర్షాలు ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి కావడం గగనమే

ఇంకా కొన్ని చెరువులకు ఖరారు కాని టెండర్లు

రూ.10 లక్షల లోపు పనులు పచ్చ చొక్కాలకు కట్టబెట్టే ఎత్తుగడ

పనుల్లో జాప్యం, పాలకుల తీరుపై ఆయకట్టు రైతుల ఆగ్రహం

Advertisement
 
Advertisement
Advertisement