కందుకూరు రూరల్: మండలంలోని ఓగూరు పంచాయతీ పరిధిలో ఉన్న చెరువు మట్టిని తవ్వేస్తున్నారు. జేసీబీలతో మట్టిని తవ్వి 167బీ జాతీయ రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి తరలిస్తున్నారు. ఓగూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడికి చెందిన సుమారు ఏడు ఎకరాలకు పైగా ఉన్న పొలాల్లో చెరువు నుంచి రాత్రింబవళ్లు ట్రాక్టర్లు, టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. పేరుకు వ్యవసాయ పొలంలోకి మట్టిని తరలిస్తున్నట్లు ఇరిగేషన్ అధికారుల వద్ద అనుమతులు పొందారు. కానీ అక్కడ జరుగుతుంది రియల్‌ఏస్టేట్ వ్యాపారం అని గ్రామస్తులు చెబుతున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఉండడంతో వెంచర్ కోసమే మట్టిని తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
భారీ తవ్వకాలతో అనుమానాలు..
ఈ చెరువులో మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు. అయితే అనుమతులతో ఒక లెవలింగ్ వరకు మాత్రమే తవ్వకాలు చేయాలి. కానీ ఈ చెరువులో లోతుగా తవ్వకాలు చేస్తున్నారు. జేసీబీలతో తవ్వకాలు చేస్తుండటంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఆ గుంతల్లో నీరు చేరి ప్రమాదకరంగా మారతాయంటున్నారు. లోతుగా ఉన్న గుంతలు తెలియక పశు కాపరులు గానీ, రైతులు గానీ చెరువులో దిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాగే కొండికందుకూరులోని చెరువు నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి పెద్ద పెద్ద గుంటలు ఏర్పడ్డాయి. దీనిని గమనించి పశువులు కడిగేందుకు చెరువులో దిగి గుంటల్లో కూరుకుపోయి యువకుడు మృతి చెందాడు. ఇవన్ని తెలిసిన అధికారులు కూడా ఇష్టానుసారంగా అక్రమంగా మట్టిని తరలిస్తుంటే ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన వారు అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరిపే ఏ అధికారి ఆ వైపు కన్నెత్తి చూడరు.
జేసీబీలతో భారీ తవ్వకాలు
ఓగూరుకు చెందిన నాయకుడి పొలానికి మట్టి తరలింపు
టీడీపీ నాయకులైతే ఏ అధికారి పట్టించుకోరు
మట్టిని దోచుకుంటున్న అధికార పార్టీ నాయకులు
లెవలింగ్ ప్రకారమే తవ్వుకోవాలి
ఓగూరు చెరువు నుంచి పొలాలకు మట్టిని తోలుకునేందుకు అనుమతులు తీసుకున్నారు. చెరువులో కూడా పెద్ద పెద్ద గుంతలు లోతుగా తవ్వకాలు చేయకుండా ఒక లెవలింగ్ ప్రకారం తవ్వుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– సీతారామయ్య, ఇరిగేషన్ ఏఈ


