ఒంగోలు సబర్బన్: ఒంగోలు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వేసవి కాలం ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలోని ప్రజలు మార్పును గమనించాలని కోరారు. ప్రజలు నిర్దేశించిన సమయానికి కార్యక్రమానికి చేరుకొని వారి వారి సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేయాలని సూచించారు.
మార్కాపురంలో 10 గంటలకు మీకోసం
మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయసునీత ఆదివారం తెలిపారు. ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో రాసుకొచ్చి అధికారులకు అందజేయాలన్నారు. అలాగే 1100 నంబరుకు ఫోన్‌కాల్ చేసి అర్జీని నమోదు చేసుకోవడంతోపాటు అర్జీ ఏ స్ధితిలో ఉందో తెలుసుకోవచ్చని చెప్పారు.
ఒంగోలు సిటీ: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం ఈ నెల 8వ తేదీ నుంచి స్థానిక డీఆర్‌ఆర్ మున్సిపల్ హైస్కూల్‌లో ప్రారంభమవుతుందని డీఈఓ సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్ పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి జిల్లాకు 10,329 జవాబు పత్రాలు అందాయన్నారు. మూల్యాంకన ప్రక్రియ కోసం సుమారు 200 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. మూల్యాంకన ప్రక్రియ మూడు రోజుల పాటు కొనసాగుతుందని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మార్చిలో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల మాదిరిగానే ఈసారి కూడా ట్యాబ్ ఆధారిత మార్కుల నమోదు విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
యర్రగొండపాలెం: మండలంలోని అమానిగుడిపాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..వి.సంతోష్ కుమార్, వి.రూబెన్, ఎ.యాకోబులు మోటారు బైక్‌పై అమానిగుడిపాడు నుంచి గుర్రపుశాలకు వెళ్తున్న సమయంలో నీళ్ల ట్యాంకర్‌తో వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో మోటారు బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందిన వారిని మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.దేవకుమార్ పేర్కొన్నారు.
సంతమాగులూరు(అద్దంకి): ఒంటరిగా బిక్కుబిక్కు మంటూ ఎండలో ఏడుస్తూ నిస్సహాయ స్థితిలో ఉన్న రెండేళ్ల పాపకు సంతమాగులూరు పోలీసులు ఆదివారం ఆశ్రయం కల్పించారు. వివరాల్లోకి వెళితే..శనివారం మధ్యాహ్నం సంతమాగులూరు మండలం కొప్పరంలో ఒక పాప ఒంటరిగా ఉండగా స్థానికులు గమనించారు. ఆ పాపను వివరాలు అడగ్గా.. ఏం చెప్పలేకపోయింది. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పాప తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల గ్రామాల్లో శనివారం రాత్రి వరకు విచారించారు. అయినా ఆచూకీ తెలియక పోవడంతో పాప పరిస్థిని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్ట్ బీవీ సాగర్, బాలల సంరక్షణ అధికారి పి.దినేష్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లడంతో వారు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారి పి. నాగమణి సహకారంతో పాపకు ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్షలు అనంతరం ఒంగోలు రాంనగర్‌లోని శిశుగృహలో చేర్పించారు. అయితే ఆ పాప తల్లిదంద్రులు ఎవరు, ఎందుకు అక్కడ ఎందుకు వదిలేశారో ఎవరికీ తెలియడం లేదు.


