ముండ్లమూరు: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో బావబామ్మర్దులైన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలై దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ముండ్లమూరు మండలంలోని పులిపాడు శివాలయం ఎదురుగా అద్దంకి–దర్శి ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు వివరాలు.. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డుకు చెందిన రేగళ్ల మణికంఠ(30), చాట్ల నాగరాజు తమ బైక్‌పై ముండ్లమూరు మండలం కెల్లంపల్లి వైపు నుంచి స్వగ్రామం వెళ్తున్నారు. వీరి బైక్ పులిపాడు శివాలయం సమీపంలోకి రాగానే పొదిలి వైపు నుంచి విజయవాడ వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్ సమీపంలో లేకపోవడంతో అరగంటసేపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడారు. ఆ తర్వాత ముండ్లమూరుకు చెందిన 108 వాహనం వచ్చి క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మణికంఠ మృతి చెందాడు. నాగరాజును మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు. బైక్‌ను ఢీకొట్టిన లారీ ఆగకుండా వెళ్తుండగా సంఘటనా స్థలంలో ఉన్న ఏఎస్సై పవన్ కుమార్, తమ సిబ్బందితో కలిసి ట్రేస్ చేశారు. లారీని పోలీస్ స్టేషన్లో ఉంచారు.


