మర్రిపూడి: గుర్తు తెలియని వ్యక్తులు రేకుల షెడ్‌కు నిప్పు అంటించడంతో ఆరుగాలాల పాటు కష్టించి పండించిన పొగాకు అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన మండలంలోని కెల్లంపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. బాధితుల వివరాల మేరకు..మండలంలోని కెల్లంపల్లి హరిజనవాడ అంబేడ్కర్ విగ్రహం సమీపంలో మల్లెల రోశయ్య రేకుల షెడ్‌కు గుర్తు తెలియని దుండగులు ఆదివారం ఉదయం నిప్పుపెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటల వ్యాపించి షెడ్‌లో ఉన్న పొగాకు బేళ్లు అగ్నికి అహుతయ్యాయి. మల్లెల రోశయ్య షెడ్‌లో అదే గ్రామానికి చెందిన రైతు పాపినేని శ్రీను 10 పొగాకు బేళ్లు దాచుకోగా, మల్లెల వెంకటేశ్వర్లు మరో 10 క్వింటాళ్లు పొగాకు నిల్వ చేసుకున్నాడు. క్యూరింగ్ అనంతరం ర్యాక్‌ల్లో ఉన్న సుమారు 1500 కర్ర సైతం పూర్తిగా కాలి బూడిదైంది. షెడ్‌లోని తాటి దబ్బలు, ఇంజన్, ఫ్యాన్‌లు, ట్రాక్టర్ సామాన్లు అన్నీ బుగ్గిపాలైయ్యాయని బాధితులు వాపోయారు. విషయం గమనించిన స్థానికులు కొండపి అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అప్పుటికే పూర్తిగా కాలిపోయినట్లు తెలిపారు. ఈ సంఘటనలో సుమారు రూ. 10 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుఅంటించి ఉంటారా? లేదా ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందా? అనే తెలియాల్సి ఉంది.
అగ్నికి ఆహుతైన పొగాకు బేళ్లు
రూ. 10 లక్షల ఆస్తి నష్టం


