దోచుకోవడమే‘దారి’! | - | Sakshi
Sakshi News home page

దోచుకోవడమే‘దారి’!

Jun 7 2026 9:12 AM | Updated on Jun 7 2026 9:12 AM

కూటమి ప్రభుత్వంలో నాణ్యతలేని రోడ్లు టీడీపీ కాంట్రాక్టర్లకే పనులు వేరే కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తే బెదిరింపులు బోడపాడు’–యాచవరం రోడ్లకు అప్పుడే గుంతలా...? ప్యాచ్‌లతో కప్పిపుచ్చే ప్రయత్నం రూ.1.50 కోట్ల ప్రజాధనం వృథా అంటూ విమర్శలు

మార్కాపురం రూరల్‌: కూటమి ప్రభుత్వ హయాంలో చేపడుతున్న రహదారి పనుల నాణ్యతపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మార్కాపురం మండలంలోని బోడపాడు–యాచవరం గ్రామాల మధ్య రూ.1.50 కోట్ల వ్యయంలో ఇటీవల నిర్మించిన తారు రోడ్డు పది రోజుల కూడా గడవకముందే పలుచోట్ల గుంతలు పడటంతో పనుల నాణ్యతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల మధ్య ప్రధాన రాకపోకలకు ఉపయోగపడే ఈ రహదారి నిర్మాణం పూర్తయిన కొద్దిరోజుల్లోనే దెబ్బతినడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోడ్డు బిల్లులు కూడా పూర్తిగా చెల్లించకముందే గుంతలు ఏర్పడటంతో అఽధికారులు, కాంట్రాక్టర్లు హడావిడిగా ప్యాచ్‌లు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. ‘పని నాణ్యతగా జరిగి ఉంటే పది రోజుల్లోనే గుంతలు ఎందుకు పడ్డాయి..?ప్యాచ్లు అవసరం ఎందుకు వచ్చింది..?’అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. తారుపొర మందం, నాణ్యత ప్రమాణాలు, మెటీరియల్‌ వినియోగం, సాంకేతిక పర్యవేక్షణ వంటి అంశాల్లో తీవ్ర నిర్లక్ష్యం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కూటమి ప్రభుత్వంలో రోడ్డు పనులు ఎక్కువగా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకే కేటాయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. టెండర్లలో ఇతర కాంట్రాక్టర్లు పాల్గొనకుండా ఒత్తిళ్లు, బెదిరింపులు ఉన్నాయంటూ స్థానికంగా చర్చ జరుగుతోంది. దీంతో పోటీ లేకుండా పనులు దక్కించుకుని నాణ్యతను గాలికొదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్యాచ్‌లు చేసిన ప్రాంతాలు మళ్లీ దెబ్బతినే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైతే రహదారి పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజాధనంతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి, తర్వాత మరమ్మతుల పేరిట అదనపు ఖర్చులు పెట్టడం సరైన విధానం కాదని ప్రజలు మండిపడుతున్నారు. బోడపాడు–యాచవరం రహదారి పనులపై ఉన్నతాధికారులు సాంకేతిక విచారణ జరిగి, నాణ్యత లోపాలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. కొత్తగా వేసిన రోడ్డు పది రోజుల్లోనే గుంతలమయం కావడం వెంటనే ప్యాచ్‌ వర్క్‌లకు దిగడం కూటమి ప్రభుత్వ అభివృద్ధి పనుల నాణ్యతకు నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement