హమాలీల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

హమాలీల సమస్యలు పరిష్కరించాలి

Jun 7 2026 9:12 AM | Updated on Jun 7 2026 9:12 AM

బిల్లులు ప్రతి నెలా మొదటి వారంలో ఇవ్వాలి సివిల్‌ సప్లయీస్‌ సంస్థకు చెందిన రైస్‌ గోడౌన్లలో పనిచేస్తున్న హమాలీలు సంస్థ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉషారాణికి వినతి పత్రం అందజేత

ఒంగోలు సబర్బన్‌: పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్‌ (సివిల్‌ సప్లయీస్‌) హమాలీల సమస్యలు పరిష్కరించాలని వారు అధికారులను కోరారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పౌర సరఫరాల సంస్థ బియ్యం గోడౌన్లలో పనిచేస్తున్న హమాలీలు శనివారం సంతపేటలోని సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ ఉమ్మడి ప్రకాశం జిల్లా అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉషారాణికి ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల సంస్థ హమాలీల యూనియన్‌ ప్రకాశం జిల్లా కమిటీ (సీఐటీయూ) సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన సమస్యల్లో ప్రతినెలా మొదటి వారంలో బిల్లు చెల్లించాలన్నారు. డీలర్లకు తోలే సరుకుల బిల్లులు స్టేజ్‌ వన్‌ పద్ధతుల్లోనే హమాలీల ఖాతాలకు ప్రతినెలా మొదటి వారంలోనే వేయాలని కోరారు. స్కూళ్లకు తోలే సరుకులు డీలర్ల దగ్గర తోలే విధంగానే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సంస్థలో పనిచేసే హమాలీలు అందరికీ సీపీఎఫ్‌ నంబర్లు ఇచ్చి ప్రావిడెంట్‌ ఫండ్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈఎస్‌ఐ పథకాన్ని అమలు చేయాలని, జనవరి ఒకటో తేదీ నుంచి వేతన ఒప్పంద కాల పరిమితి అయిపోయిందని, కూలి రేట్లు పెంచి బకాయిలతో సహా చెల్లించాలని కోరారు. చనిపోయిన, రిటైర్‌ అయిన, మానుకున్న వారి పీఎఫ్‌ క్లెయిమ్‌లు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రస్తుత స్టాక్‌ పాయింట్‌ పరిధిలో ఉన్న రేషన్‌ షాపులను మార్పులు చేసేలా మానుకోవాలని, ఏ స్టాక్‌ పాయింట్‌ పరిధిలో ఉన్న మండలాలు ఆ పరిధిలోనే కొనసాగించాలని మార్పులు, చేర్పులు చేసి కార్మికులకు నష్టం చేకూర్చే చర్యలు చేపట్టవద్దని చెప్పారు. రేషన్‌ షాపులకు సరుకులు ప్రతినెలా 20వ తేదీ నుంచి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ గిడ్డంగుల్ని నిర్మించాలని, ఉన్న గిడ్డంగులని ఉపయోగించుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్‌ లో సమ్మెకు సిద్ధమవుతామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, హమాలీల యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు బిందె ఆంజనేయులు, ఓ ప్రసాదరావు, సునీల్‌, వెంకటరావు, నాగార్జున, వెంకటయ్య, నాగిరెడ్డి, అడకా నాగరాజు, ఓరుగుంట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement