కలెక్టర్ పీ రాజాబాబు పల్లెనిద్రలో రెండో రోజు సమస్యలప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్
అద్దంకి: ఆక్రమణలకు గురై, పొలాలకు వెళ్లేందుకు రైతులు ఇబ్బంది పడుతున్న పోలవరం డొంకను కలెక్టర్ రాజాబాబు శనివారం పరిశీలించారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని తిమ్మాయపాలెంలో కలెక్టర్ రెండో రోజు ఉదయం గ్రామస్తులు అర్జీలు అందజేసిన సమస్యల ప్రాంతాలను పరిశీలించారు. గ్రామస్తులందరికీ ఉపయోగకరమైన డొంకను వెంటనే సర్వే చేసి అభివృద్ధి చేయాలని సర్వేయర్, సంబంధిత అధికారులను ఆయన అదేశించారు. గ్రావెల్ తోలి తామే అభివృద్ధి చేసుకుంటామని గ్రామస్తులు కలెక్టర్‌తో చెప్పారు. తొలుత గ్రామంలోని చెత్త సంపద నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడంతో పాటు వర్మీ కంపోస్టు తయారు చేస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి ఆదాయం వచ్చేలా నిర్వహణ కేంద్రం పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం తిమ్మాయపాలెం రక్షిత నీటి పథకాన్ని, ఎత్తిపోతల పథకాన్ని సందర్శించి సంబంధిత పథకాల వివరాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అధికారులతో కలసి మొక్కలు నాటారు. మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకును పరిశీలించి, నీటిని క్లోరినేషన్ చేస్తున్న విధానంపై కలెక్టర్ ఆరా తీశారు. రాష్ట్రీయ గోకుల మిషన్ కింద ఏర్పాటు చేసిన లేగదూడల ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు. ఎస్సీ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించి, శ్మశాన వాటిక స్థలానికి ప్రహరీ కట్టించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఎస్సీ కాలనీని సందర్శించి ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతున్న తీరును పరిశీలించారు. గ్రామంలో చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియ విధానాన్ని పరిశీలించడంతో పాటు ఎంత శాతం ప్రక్రియ పూర్తి చేశారు, ఏ విధంగా చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో అత్యంత పారదర్శకత, నాణ్యత ఉండాలని, నిబంధనల ప్రకారం మ్యాపింగ్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట అద్దంకి ఆర్‌డీఓ విజయజ్యోతి, మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


