బెల్టు షాపుల వద్ద నెల మామూళ్లు...
ముండ్లమూరు:
స్థానిక పోలీస్‌స్టేషన్‌కు రెండు నెలలకుపైగా ఎస్సై లేకపోవడం, ఏఎస్సై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అవినీతి అక్రమాలు, సెటిల్‌మెంట్లు, దందాలకు పాల్పడుతుండటంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. నేరాలు, ఘోరాలు, చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసు స్టేషన్‌లోనే ప్రైవేటు పంచాయితీలు చేస్తున్నారని, మండలంలో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని ప్రజల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ముండ్లమూరు పోలీస్‌స్టేషన్‌కు ఎస్సైగా పనిచేస్తున్న కమలాకర్ రెండు నెలల క్రితం బదిలీ అయ్యారు. అనంతరం తాత్కాలిక ఎస్సైగా దర్శి డీఎస్పీ కార్యాలయం నుంచి గుర్రం ప్రసాద్ అనే ఎస్సైని నియమించినప్పటికీ కేవలం మూడు రోజులే పనిచేసి తిరిగి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లిపోయారు. ఏఎస్సై తీరే అందుకు కారణమని స్టేషన్ సిబ్బందిలో అప్పట్లో చర్చ నడిచింది. ఏడాది క్రితం కొమరోలు నుంచి వచ్చి ముండ్లమూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్సై.. అధికార పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలుగుతూ రెండు నెలలుగా ఇక్కడకు ఎస్సైని నియమించకుండా అడ్డుకుంటున్నాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు...
ముండ్లమూరు ఏఎస్సై తీరుతో మండల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. పోలీస్‌స్టేషన్‌ను సెటిల్‌మెంట్లకు అడ్డాగా మార్చేశారంటూ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. కోడి పందేలు, పేకాట, క్రికెట్ బెట్టింగ్‌ల నిర్వాహకులతో చేతులు కలిపి ప్రోత్సహిస్తూ భారీ మొత్తంలో ముడుపులు పుచ్చుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఘర్షణ కేసులు, ఇతర నేరాలపై పోలీస్ స్టేషన్‌లోనే ప్రైవేటు పంచాయితీలు చేస్తున్నాడని, అందుకు భారీగా వసూళ్లు చేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని 21 పంచాయతీలలో 52 గ్రామాలుండగా.. నిత్యం ఏదో ఒక గ్రామంలో గొడవలు జరుగుతుంటాయి. వాటిని అడ్డం పెట్టుకుని ఏఎస్సై సెటిల్‌మెంట్లు చేసి నిందితుల వద్ద నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి.
మండలంలో
దొంగతనాలను కట్టడి చేయని వైనం...
మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల దొంగతనాలు జరిగాయి. రోజురోజుకూ చోరీలు పెరిగిపోతున్నాయి. కానీ, దొంగలను పట్టుకోవడంపై శ్రద్ధ పెట్టకుండా దందాలు, సెటిల్‌మెంట్లపైనే ఏఎస్సై ఆసక్తి చూపిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. మండలంలో జరిగిన దొంగతనాల్లో పెద్ద ఎత్తున వెండి, బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. కానీ, వాటి రికవరీ గురించి ఏఎస్సై పట్టించుకున్న పాపాన పోలేదు. కొన్ని నెలల కిందట పోలవరం గ్రామంలోని లక్ష్మీపురంలో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లినా.. నేటికీ నిందితుడి ఆచూకీ కనిపెట్టలేదు. అదేవిధంగా పెద్ద ఉల్లగల్లులో శంకర్‌రావు ఇంట్లో చోరీ జరిగింది. పోలీస్‌స్టేషన్ పక్కనే పట్టపగలే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి లక్ష రూపాయలు తీసుకెళ్లారు. ఇవి కాకుండా కొన్ని నెలల నుంచి 50కిపైగా రైతుల ట్రాన్స్‌ఫార్మర్లు దొంగల పాలయ్యాయి. ఇలా చెప్పుకుంటూపోతే.. మండలంలో ఎన్నో భారీ, చిల్లర దొంగతనాలు జరుగుతున్నాయి. వాటిని కట్టడి చేసేందుకు కనీస చర్యలు కూడా తీసుకోకుండా.. కేవలం అవినీతి అక్రమాలపైనే ఏఎస్సై దృష్టి సారిస్తున్నారని ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
జూదాన్ని పెంచిపోషిస్తున్నారంటూ
ఆరోపణలు...
దర్శి నియోజకవర్గంలోని ఓ పోలీసు అధికారితో లాలూచీపడి ముండ్లమూరు మండలంలో జూదాన్ని ఏఎస్సై పెంచిపోషిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారం వస్తే చాలు.. అగ్రహారం, నూజెళ్లపల్లి, కెల్లంపల్లి గ్రామాల్లో కోడి పందేలు, సుంకరవారిపాలెం, పూరిమెట్ల, అగ్రహారం, మారెళ్ల, శంకరాపురం, కొమ్మవరం గ్రామాల్లో పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. వాటి నిర్వాహకుల వద్ద ముడుపులు పుచ్చుకుని పైఅధికారికి వాటాలు పంపిస్తూ చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెండు నెలలకుపైగా లేని ఎస్సై
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఏఎస్సై
స్టేషన్‌లోనే ప్రైవేటు పంచాయితీలు, దందాలు
అవినీతికి పాల్పడుతూ అసాంఘిక కార్యకలాపాలను పెంచిపోషిస్తున్నాడంటూ ఆరోపణలు
భయాందోళనకు గురవుతున్న మండల ప్రజలు
పట్టించుకోని పోలీసు ఉన్నతాధికారులు
నాకెవరూ ఫిర్యాదు చేయలేదు
ముండ్లమూరు పోలీసుస్టేషన్‌పైగానీ, ఏఎస్సైపైగానీ నాకెవరూ ఫిర్యాదు చేయలేదు. గ్రామాల్లో చిన్నచిన్న గొడవలు జరగడం సహజం. వాటిపై కేసులు నమోదు చేసే సమయంలో విచారించడం మామూలే. మా దృష్టిలో ముండ్లమూరు పోలీస్‌స్టేషన్ పనితీరు బాగానే ఉంది. త్వరలో కొత్త ఎస్సై కూడా వస్తారు.
– రామారావు, సీఐ, దర్శి
గ్రామాల్లో మద్యం బెల్టు షాపులు నిర్వహించే వారి వద్ద నెల మామూళ్లు వసూళ్లు చేసి మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నా గుడ్లప్పగించి చూస్తున్నారని కూడా ఏఎస్సైపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులే బెల్టు షాపులు నిర్వహించాలనే నిబంధనలు అమలుచేస్తూ మద్యం మాఫియాని పెంచిపోషిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పోలీస్‌స్టేషన్‌లో అంతా తానై వ్యవహరిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆ స్టేషన్‌కు ఎస్సై రాకుండా మేనేజ్ చేస్తూ వస్తున్నారని ఏఎస్సైపై బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నప్పటికీ.. పోలీసు ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడంలో మతలబు ఏమిటో అర్థంకావడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్టేషన్‌కు కొత్త ఎస్సైని నియమించి ఏఎస్సై ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుకుంటున్నారు.


