మార్కాపురం: ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణ మానుకోవాలని, పెరిగిన ధరల అనుగుణంగా మధ్యాహ్న భోజనం కార్మికులు కనీసవేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ స్థానిక జిల్లా పరిషత్ బాలల ఉన్నత పాఠశాలలో ఎంఈఓ రాందాస్ నాయక్‌కు శనివారం వినతిపత్రం ఇచ్చినట్టు సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి డీకేఎం రఫీ తెలిపారు. ప్రైవేటీకరణ పేరుతో మధ్యాహ్నం భోజన పథకాన్ని కార్పొరేటర్ సంస్థలకు అప్పజెప్పడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైందని ఈ ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం భోజనం పథకంపై ఆధారపడి వేల కుటుంబాలున్నాయని ప్రైవేటీకరణ వల్ల వారు ఉపాధికి దూరమవుతారన్నారు. ప్రస్తుతం కార్మికులకు గౌరవ వేతనం పేరుతో కేవలం 3000 మాత్రమే ఇస్తోందని 3 వేలతో కుటుంబాలు గడవడం ఇబ్బందిగా ఉన్నాయన్నారు. వంట గ్యాస్ రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వమే వంటగ్యాస్‌ను సరఫరా చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలను ఒక విద్యార్థికి 20 రూపాయలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. వేతనాలు, బిల్లులు కూడా ప్రతి నెలా ఇవ్వడం లేదని దీంతో అప్పు తెచ్చి పథకాన్ని నిర్వహించ పరిస్థితి ఏర్పడిందని దీంతో కార్మికులు అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆవేదన చెందారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని, కార్మికుల కనీస వేతనం పెంచాలని ఈనెల 8న కలెక్టరేట్ వద్ద జరుగు ధర్నాలో మధ్యాహ్నం భోజన కార్మికులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు జమ్ముల నాగరాజు, మధ్యాహ్న భోజన కార్మికులు, రామిరెడ్డి, లక్ష్మి, వరాలు, కాశింబి, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.


