కనిగిరి రూరల్: పట్టణంలోని ఒంగోలు బస్టాండ్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వన్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి చిరాగ్ పాశ్వన్ మాట్లాడుతూ మన అందరి నేత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అని కీర్తించారు. బీఆర్ అంబేద్కర్ గోప్ప దార్శనీకుడని కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు వంగలపుడి అనిత, డోలా వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, ఎంఎస్ రాజు, ఇంటూరి నాగేశ్వరరావు, కందుల నారాయణరెడ్డి, ఎం.ఆశోక్‌రెడ్డి, ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి పాల్గొన్నారు.
మార్కాపురం టౌన్: కుటుంబ కలహాలతో ఎలుకల మందు తిని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మార్కాపురం పట్టణంలోని షాదీఖానాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చింతగుంట్ల గ్రామానికి చెందిన రెడ్డెపోగు నాగభూషణం (45) శనివారం మార్కాపురంలోని కంభం సెంటరులో ఉన్న షాదీఖానా వద్ద నిర్జీవంగా పడి ఉన్నాడు. అతని వద్ద ఎలుకల మందు ప్యాకెట్, బాదంపాలు గ్లాసు ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన గొడవ కారణంగా ఎలుకల మందు తిని చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
త్రిపురాంతకం: స్థానిక వైన్ షాప్ పరిసరాల్లో శనివారం ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. త్రిపురాంతకంలోని మార్కాపరుం రోడ్డు వైన్ షాపు సమీపంలో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అక్కడ ఒక వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. త్రిపురాంతకానికి చెందిన డి.వెంకటరెడ్డిగా స్థానికులు గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతనునాలుగు రోజులుగా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం పోలీసులు విచారిస్తున్నారు.


