● అధికారులతో కలెక్టర్ రాజాబాబు సమీక్ష
ఒంగోలు సబర్బన్: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో టాయిలెట్లు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పనపై తక్షణమే దృష్టి సారించాలని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. శనివారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనంలో జిల్లాస్థాయి తాగునీరు, పారిశుధ్య కమిటీ సమావేశం నిర్వహించారు. జలజీవన్ మిషన్ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిపై ఆరా తీశారు. జల జీవన్ మిషన్ పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ క్రమంలో పాఠశాలలు, కళాశాలలో తాగునీరు, టాయిలెట్లు, ఇతర పారిశుధ్య సదుపాయాలపై ప్రత్యేకంగా చర్చించారు. మరమ్మతులు, ఇతర నిర్వహణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉంటే పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. గ్రామ పంచాయతీ, సీఎస్‌ఆర్ నిధులతో పాటు దాతల సహాయం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, డీపీఓ వెంకటేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ నారాయణ, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో చిరంజీవి, ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, డీఈవో రేణుక, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


