కొండపి: జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి అడ్డుగా టీడీపీ నాయకులు ఫ్లెక్సీ కట్టి ప్రజలకు ఆ మహానుబావుని విగ్రహం కనిపించకుండా చేసిన సంఘటన మండలంలోని నేతివారిపాలెంలో చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. గతంలో ఇప్పుడు ఉన్న గాంధీ విగ్రహానికి పక్కనే మరో గాంధీ విగ్రహాన్ని చాలా సంవత్సరాల క్రితం ప్రతిష్టించారు. ఇప్పుడు పాత విగ్రహం ఉన్న స్థలంలో టీడీపీ నాయకుల విగ్రహాలు పెట్టాలన్న ఉద్దేశంతో పాత గాంధీ విగ్రహాన్ని తొలగించి ఆ స్థలంలో పనులు ప్రారంభించారు. నూతనంగా పక్కనే రచ్చబండ ఉన్న ప్రదేశంలో గాంధీ విగ్రహాన్ని కొన్ని నెలల క్రితం ప్రతిష్టించారు. మహానాడు సందర్భంగా నేతివారిపాలెంలోని టీడీపీ నేతలు ఆ రచ్చబండ ప్రదేశంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీ ప్రజలకు గాంధీ విగ్రహాన్ని కనబడకుండా చేసింది. కొన్ని రోజులుగా అలానే ఉన్న పంచాయతీ సెక్రటరీ, ఇతర అధికారులు గాంధీ విగ్రహానికి అడ్డుగా ఉన్న ఫ్లెక్సీని తొలగించడానికి సాహసం కూడా చేయలేదు.


