పల్లెనిద్ర కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతి
అద్దంకి: గ్రామంలోని హిందూ శ్మశాన వాటికలో ఆక్రమణలు తొలగించి ప్రహరీ నిర్మించాలని, శివాలయం పక్కనే ఉన్న చెరువులో ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేయాలని కలెక్టర్ రాజాబాబుకు తిమ్మాయపాలెం గ్రామస్తులు అర్జీ సమర్పించారు. అదే విధంగా గ్రామం నుంచి పోలవరం వెళ్లే చారిత్రక డొంక ఆక్రమణలు తొలగించి, రహదారి నిర్మాణం చేయాలని కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. గ్రామంలో కొన్ని డ్వాక్రా సంఘాలు కలిపి ఒక కుటీర పరిశ్రమను పెట్టుకోవడం కోసం అనుమతి ఇవ్వాలని కోరారు. శుక్రవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజాబాబు మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలోని బొడ్డురాయి వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులతో, యువతతో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతున్న తీరుపై ఆరా తీశారు. గ్రామ సమస్యలపై దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గ్రామస్తుల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించాలని, డ్వాక్రా రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు. రామాయపాలెంలోని తన భూమిని ఆన్‌లైన్ చేయించాలని, తిమ్మాయపాలెంలో తన పొలం పక్కన నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన బట్టీని తొలగించాలని ఓ రైతు అర్జీ ఇచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి మాధురి, అద్దంకి ఆర్డీవో విజయ జ్యోతి, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డీపీవో వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


