ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: చంద్రబాబు నాయకత్వంలో రెండేళ్లుగా కొనసాగుతున్న రాక్షస పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, కూటమి నాయకుల పతనానికి సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాల్లో కదంతొక్కిన ప్రజలను చూస్తుంటే రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందని, దుర్మార్గపు పాలనలో రాష్ట్రం అతలాకుతలమవుతోందని అన్నారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలుచేయలేకపోయారని, సంపద సృష్టి అంటూ కూటమి నాయకుల సంపాదనకు బాటలు వేశారని విమర్శించారు. రేషన్ బియ్యం, మట్టి, ఇసుక పోటాపోటీగా అక్రమంగా రవాణాచేస్తూ కోట్లాది రూపాయలు దాచేసుకుంటున్నారని అన్నారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడంలో టీడీపీ నాయకులు ఆరితేరి ఉన్నారని, ఆ ప్రాంతం రైతుల భూములు లాక్కోవడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అమలు చేసిన నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్రంలోని అన్నివర్గాలకు చెందిన పేదలు ఆనందంగా ఉన్నారని, ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రెండేళ్లపాటు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని, త్వరలో జరిగే స్థానిక సంస్ధల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తారని అన్నారు.
8న సర్‌పై బీఎల్‌ఏలతో సమావేశం
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి బూత్‌లెవెల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిషన్ పెట్టిన ప్రభుత్వ ఉద్యోగితో బీఎల్‌ఏలు వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేస్తామని, బోగస్ ఓటర్ల పేరుతో వైఎస్సార్ సీపీ శ్రేణులు, సానుభూతిపరుల ఓట్లను అక్రమంగా తొలగించకుండా చేపట్టాల్సిన అంశాలపై చర్చిస్తామని తెలిపారు.
వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఇండోర్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ మీటింగ్‌లో చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళ, రైతులకు చేసిన మోసాలపై చర్చిస్తారని, రెండేళ్ల రాక్షస పాలనకు నిరసనగా నల్లబెలూన్లు ఎగురవేసే కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు.


