హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ అరుణ్‌బాబు
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలో లబ్ధిదారులకు మంజూరైన నిర్దేశించిన గృహాల నిర్మాణాలను సెప్టెంబర్‌లోపు పూర్తి చేయాలని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ పీ అరుణ్ బాబు జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాకు వచ్చిన ఆయన శుక్రవారం జిల్లా హౌసింగ్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖలో పని చేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో గృహ నిర్మాణ లక్ష్యాలు, సాధించిన పురోగతి, పీపీపీ పీఎంఏవై–యు 2.0 కార్యక్రమాల అమలు పురోగతిపై విపులంగా సమీక్ష నిర్వహించారు. నిర్ణీత లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని, పనుల పురోగతిని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఎండీ పలు సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో బేస్మెంట్ స్థాయిలో 4,814 ఇళ్లు, లింటెల్ స్థాయిలో 716 ఇళ్లు, రూఫ్ స్థాయిలో 1,333 ఇళ్లు మొత్తం 6,863 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నట్లు వివరించారు. ఈ ఇళ్లన్నింటినీ సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, ఆగస్టు 2026 నెలాఖరులోగా పూర్తి చేయాల్సిన 3,997 ఇళ్లను జిల్లా లక్ష్యంగా నిర్దేశించినందున, వాటిని కూడా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అదే విధంగా గృహ నిర్మాణ కార్యక్రమాల అమలులో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో పెరుగు శ్రీనివాస ప్రసాద్, ప్రకాశం జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు పాల్గొన్నారు.


