ఒంగోలు సబర్బన్: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–1104 ప్రకాశం ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ‘‘విద్యుత్ శ్రామిక రక్షణ భవనం’’ను శుక్రవారం ప్రారంభించారు. పర్యవేక్షక ఇంజినీర్ కార్యాలయం వెనుక తూర్పు వైపున ఉన్న అన్నవరప్పాడు కాలనీ 4వ లైన్‌లో నిర్మించిన ఈ స్వంత భవనాన్ని రాష్ట్ర అధ్యక్షుడు వి.దేవేంద్ర రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపతి వీఎస్‌ఆర్‌కే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, సభ్యుల సహకారంతో నిర్మించిన ఈ భవనం ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రబిందువుగా నిలుస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో యూనియన్ కార్యకలాపాలకు ఈ భవనం మరింత బలోపేతంగా ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అతిథులుగా ఆర్.సంజీవరావు, ఎ.శ్రీనివాసరావు, వై.మల్లేశ్వర రెడ్డి, యన్.శర్మ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో ప్రాంతీయ నాయకులు, కార్యకర్తలు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.


