టంగుటూరు:
వాహనదారులు, ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలన్నా.. రవాణా వ్యవస్థ సక్రమంగా సాగాలన్నా రహదారులు ఎంతో కీలకం. అలాంటి రహదారుల నిర్మాణంలో కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. రోడ్ల నిర్మాణం అంటేనే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అందుకే.. ఒకసారి నిర్మిస్తే పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేలా చూడాలి. కానీ, కోట్లు ఖర్చు చేసి నిర్మించిన రోడ్లు కూడా కొందరి అలసత్వం కారణంగా ప్రజలకు సౌకర్యం కలిగించకపోగా.. అసౌకర్యం కలిగిస్తున్నాయి. వాహనదారులు ఏమాత్రం ఏమరపాటుతో వెళ్లినా ప్రమాదాలు జరిగి ప్రాణాలే పోయేలా ఉన్నాయి. అలాంటి పరిస్థితులే టంగుటూరు మండల కేంద్రంలో నెలకొన్నాయి. స్థానిక బైపాస్ నుంచి పట్టణంలోని సెంటర్ వరకు సుమారు 6 కోట్ల 39 లక్షల రూపాయలతో ఇటీవల సిమెంట్ రోడ్డు నిర్మించారు. కొండపి – టంగుటూరుకు ప్రధాన రహదారి అయినప్పటికీ ఈ రోడ్డు మార్జిన్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ కక్కుర్తి పడి మార్జిన్లను మరీ అధ్వానంగా నిర్మిస్తున్నాడు. ఎందుకూ పనికిరాని బూడిద కలిసిన బురద మట్టిని రోడ్డు మార్జిన్లకు తోలుతున్నాడు. దానివలన మార్జిన్‌లోకి వాహనం దిగితే టైర్లు దిగబడి అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వచ్చేది వర్షాకాలం కావడంతో మార్జిన్లకు వాడిన బూడిద, మట్టి కరిగిపోయి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. నిత్యం వందల వాహనాలు, వేల మంది ప్రయాణికులు, రైతులు తిరిగే రోడ్డు మార్జిన్లను ఇంత అధ్వానంగా నిర్మిస్తుండటంపై ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. కాంట్రాక్టర్, అధికారులు కుమ్మకై ్క మార్జిన్లను దారుణంగా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులైనా స్పందించి సిమెంట్ రోడ్డు మార్జిన్లను నాణ్యంగా నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు.


