ఒంగోలు టౌన్: స్థానిక చెరువుకొమ్ముపాలెంలోని కందులూరు కుంటలో ఈతకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయిన స్థానికులైన నలుగురు చిన్నారుల అంత్యక్రియలు శుక్రవారం ముగిసాయి. ఒంగోలు జీజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం చిన్నారులు కరేటి అభిరామ్, సుశాంత్, పొదిలి చిన్ను, దినేష్ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. నలుగురి మృతదేహాలను అంబులెన్సులో గ్రామానికి తరలించారు. చిన్నారుల మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. గ్రామంలో ఎటుచూసినా విషాద వాతావరణం కనిపించింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చిన్నారులకు అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
ఒంగోలు: చెక్‌బౌన్స్ కేసులో నిందితుడు ఎస్.రత్నరాజుకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ స్థానిక ప్రత్యేక మొబైల్ కోర్టు న్యాయమూర్తి వి.వెంకటేశ్వరరావు శుక్రవారం తీర్పు చెప్పారు. 2015 జనవరి 22న ఫిర్యాది ఆనంద్‌కుమార్ వద్ద నిందితుడు తన కుటుంబ అవసరాల కోసం రూ.4 లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోవడంతో ఆనంద్‌కుమార్ కోర్టును ఆశ్రయించాడు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం నిందితునిపై నేరం రుజువైనట్లు పేర్కొంటూ ఏడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు ఫిర్యాదికి రూ.5.90 లక్షల నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
కొమరోలు (బేస్తవారిపేట): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి కొమరోలు మండలంలోని బాదినేనిపల్లె సమీపంలో చోటుచేసుకుంది. బాదినేనిపల్లెకు చెందిన ఎర్రి మధు (25) వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కనుమల గ్రామంలో అత్తగారింట్లో ఉన్న భార్యాపిల్లలను చూసేందుకు వెళ్లాడు. అతనికి ఐదు రోజుల క్రితమే కుమారుడు జన్మించాడు. కనుమల నుంచి తిరిగి బాదినేనిపల్లెకు మోటారు సైకిల్‌పై వస్తూ ఆ గ్రామ సమీపంలోని బ్రిడ్జిపై అదుపుతప్పి పైనుంచి కింద ఉన్న పులివాగులో పడిపోయాడు. తలకు తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. శుక్రవారం ఉదయం వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య ప్రమీల, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సింగరాయకొండ: చేపల వేట చేస్తూ మత్స్యకారుడు మృతిచెందిన సంఘటన శుక్రవారం ఉదయం సింగరాయకొండ మండలంలోని పాకల పల్లెపాలెం సమీపంలో సముద్రం వద్ద గల పగురులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక మత్స్యకారుడు పిన్ని వెంకటేశ్వర్లు (60) కూర కోసం తెప్పలో సముద్రానికి సమీపంలోని పగురులో చేపల వేట చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ కాళ్లకు వల చుట్టుకుంది. దీంతో నీటిలో పడి చనిపోయాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్.సుధీర్‌కుమార్ తెలిపారు.
పెద్దదోర్నాల: శ్రీశైలం ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద శుక్రవారం పోలీసులు కాన్వెక్స్ మిర్రర్ ఏర్పాటు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన కాన్వెక్స్ మిర్రర్ మాయం కావడంపై శుక్రవారం సాక్షి దినపత్రిక జిల్లా పేజీలో ‘కాన్వెక్స్ మిర్రర్లు మాయం’ అనే శీర్షికతో ఫొటో కథనం ప్రచురితమైంది. ఆ కథనానికి స్పందించిన యర్రగొండపాలెం సీఐ అజయ్‌కుమార్, ఎస్సై వెంకట రమణయ్యలు హుటాహుటిన పెద్దమూల టర్నింగ్‌లో ఆకతాయిలు మాయం చేసిన కాన్వెక్స్ మిర్రర్ స్థానంలో కొత్త కాన్వెక్స్ మిర్రర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించి యాత్రికుల రక్షణ కోసం ఘాట్ రోడ్డులో ఏర్పాటు చేసిన కాన్వెక్స్ మిర్రర్లు ఎంతో ముఖ్యమైనవని, వాటిని తొలగించడం చట్టరీత్యా నేరమని అన్నారు.


