ఒంగోలు సబర్బన్: పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఒంగోలులోని ప్రకాశం భవనంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్.. ప్రకాశం భవనం ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై కలెక్టర్ సంతకం చేశారు. అనంతరం ప్రకాశం భవనం నుంచి మినీ స్టేడియం వరకు ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అవకాశం ఉన్నంత వరకు నడక, ప్రజా రవాణా వ్యవస్థ, కలిసి ఒకే వాహనంలో ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ మాధురి, డీఎఫ్‌ఓ వినోద్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ విజయ్ మోహన్, ఒంగోలు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రామ్‌భూపాల్‌రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, ఇతర అధికారులు, వావ్, ఐటీసీ, సార్డ్స్ స్వచ్ఛంద సంస్థలు, భగీరథ కెమికల్స్, మున్నంగి సీ ఫుడ్స్, జేసీ బయోటిక్స్ పరిశ్రమల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
హరితాంధ్రప్రదేశ్ సాధనగా ముందుకు సాగాలి : మార్కాపురం కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం టౌన్: పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములై హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు కృషి చేయాలని మార్కాపురం కలెక్టర్ ఎం.విజయ సునీత పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మార్కాపురంలోని కలెక్టరేట్లో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మార్కాపురం – తర్లుపాడు మెయిన్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు జేసీ పి.శ్రీనివాసులు, స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డితో కలిసి సైకిల్‌పై వచ్చి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడాలన్నారు. పర్యావరణాన్ని భావితరాలకు ఆస్తిగా అందించాలన్నారు. భూ, జల, వాయు కాలుష్యంతో మానవాళికి ముప్పు వాటిల్లుతోందన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి కాలుష్య రహిత సమాజానికి పాటుపడాలన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ తయారీపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ శివరామిరెడ్డి, డీఎఫ్‌ఓ అబ్దుల్ రవూఫ్, అటవీశాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజలకు ప్రకాశం కలెక్టర్ రాజాబాబు పిలుపు


