టెన్త్‌ టాపర్స్‌కు అరుదైన అవకాశం | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ టాపర్స్‌కు అరుదైన అవకాశం

Jun 5 2026 4:47 AM | Updated on Jun 5 2026 4:47 AM

చీమకుర్తి: జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలనే కోరిక ప్రతి వారిలో ఉంటుంది. అదే మధ్య తరగతి కుటుంబాల్లో ఆ కోరిక ఆశగానే మిగులుతోంది. అలాంటిది విద్యార్థిగా ఉండగానే ఆ కోరికకు రెక్కలు వచ్చి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విమానం ఎక్కితే ఆ ఆనందానికి అవధులే ఉండవు. అలాంటి అదృష్టం సంతనూతలపాడు మండలంలోని ప్రభుత్వ హైస్కూళ్ల విద్యార్థులకు వచ్చింది. మండలంలోని ప్రభుత్వ, గురుకుల, జిల్లా పరిషత్‌ హైస్కూళ్లు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించి స్కూల్‌ టాపర్‌గా నిలిచిన వారిని ఒకరు చొప్పున 10 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారిని విమానం ఎక్కేందుకు అదే మండలం ఎనికపాడు గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ విక్రమ్‌ తారాబాయి అవకాశం కల్పించారు. ఈ నెల 3వ తేదీన గన్నవరం విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దిగారు. హైదరాబాద్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించి తిరిగి సంతనూతలపాడుకు తీసుకొచ్చారు. ఎన్‌ఆర్‌ఐ విక్రమ్‌ తారాబాయ్‌ ఎనికపాడు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ పూర్వ విద్యార్థి. విద్యార్థులకు అహ్లాదాన్ని కలిగించే కార్యక్రమంలో భాగంగా విమానం ఎక్కించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోతూ విమానాంలోనే సెల్ఫీలు తీసుకుంటూ సంతోషంగా గడిపారు.

Advertisement
 
Advertisement
Advertisement