దోచేస్తున్నారమ్మా!
చంద్రబాబు చెప్పిన ‘సంపద సృష్టి’ మంత్రాన్ని టీడీపీ చోటా నాయకులు నిరంతరం జపిస్తున్నారు! ‘ఆదాయాన్ని పంచుతా’ అని చెప్పిన చంద్రబాబు ఇచ్చిన హామీ ఏనాడో అటకెక్కింది. కానీ, పచ్చ నేతల దోపిడీ రెండేళ్లుగా అప్రతిహతంగా సాగుతోంది. ఇసుక, మట్టి, గ్రావెల్, గ్రానైట్, రేషన్ బియ్యం, ఉపాధి హామీ పనులను తమ అవినీతి అక్రమాలకు వనరుగా ఎంచుకున్న పచ్చ ముఠా.. చివరకు మంచినీటినీ వదల్లేదు. మండు వేసవిలో నీళ్లకు ఉన్న డిమాండ్‌ను తెలుగు తమ్ముళ్లు సొమ్ము చేసుకునే పనిలో మునిగి తేలుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటి నీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే.. తమకు ధనమే ముఖ్యం అంటూ నదులు, కాలువలు, పట్టా భూముల్లో సైతం పదుల సంఖ్యలో బోర్లు వేసి విద్యుత్ మోటార్లు అమర్చి ట్యాంకర్లకు నీరు నింపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేల అండతో నీళ్ల దందా సాగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
మద్దిపాడు మండలం పాతబూరేపల్లి గ్రామ సమీపంలో గుండ్లకమ్మ నది ఒడ్డున బోర్లు వేసి నీటిని ట్యాంకర్లకు నింపుతుండగా, అదే ప్రాంతంలోని పాత అన్నంగి గ్రామ సమీపంలో నేరుగా గుండ్లకమ్మ నదిలోకి పైపులు వేసి మోటార్లతో ట్యాంకర్లు నింపి సొమ్ము చేసుకుంటున్నారు. మద్దిపాడు లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం పరిసరాల్లో జాతీయ రహదారికి అతి సమీపంలో ఓ టీడీపీ నాయకుడు కాలువ పక్కన ఉన్న తన భూమిలో బోర్లు వేసి యథేచ్ఛగా ట్యాంకర్లకు నీరు అమ్ముకుంటున్నాడు. ఒంగోలు నగరంలోని వడ్డెపాలెంలో స్థానిక టీడీపీ నాయకుడు పట్టా భూమిలో బోర్లు వేసి ఇంజన్ల సాయంతో ట్యాంకర్లు నింపి సొమ్ము చేసుకుంటున్నాడు. ఒక్కో ట్యాంకర్ రూ.3 వేల నుంచి దూరాన్ని బట్టి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. పరిశ్రమలు, హోటళ్లు, కార్పోరేట్ హాస్పిటళ్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు, రెస్టారెంట్లకు నీటిని తరలిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో బోర్లు వేసి, ఇంజన్లతో నీటి తోడేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఒంగోలు


