వృద్ధ దంపతుల దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతుల దుర్మరణం

Jun 5 2026 4:47 AM | Updated on Jun 5 2026 4:47 AM

సింగరాయకొండ: రోడ్డు క్రాస్‌ చేసేందుకు ఆగి ఉన్న మోటార్‌ సైకిల్‌ను ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొన్న ప్రమాదంలో వృద్ధ దంపతులు షేక్‌ అల్లిసాహెబ్‌ (75), షేక్‌ నాగూర్‌బీ (60) దుర్మరణం చెందారు. వారి మనువడికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం రాత్రి 10 గంటల సమయంలో మండల పరిధిలోని జాతీయ రహదారిపై విమానాల రన్‌వేపై వెంకటేశ్వర కళ్యాణ మండపం సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామానికి చెందిన షేక్‌ అల్లీసాహెబ్‌, షేక్‌ నాగూర్‌బీలు కందుకూరులో తమ బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో మండలంలోని మూలగుంటపాడులో ఉన్న తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు తమ మనువడు షేక్‌ నాగూర్‌వలితో కలిసి మోటారు సైకిల్‌పై బయల్దేరారు. రోడ్డు దాటే ప్రయత్నంలో వెంకటేశ్వర కల్యాణ మండపం సమీపంలోకి రాగానే ఒక వైపు రోడ్డు దాటి రోడ్డు మధ్యలో ఆగారు. నెల్లూరు వైపు వెళ్లే వాహనాలు గమనించి రోడ్డు దాటే ప్రయత్నంలో ఉన్నారు. అదే సమయంలో ఒంగోలు వైపు భారీ లోడ్‌తో లారీ వెళ్తోంది. ఈ లారీలో సరుకు క్యాబిన్‌ దాటి వెడల్పు లోడ్‌తో ఉంది. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో ఉన్న వీరిని అదనపు లోడ్‌ తగలటంతో మోటారు సైకిల్‌పై నుంచి వృద్ధ దంపతులు ఒకరి తర్వాత ఒకరు కింద పడిపోయారు. వీరిపై లారీ టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మరణించారు. మనవడు నాగూర్‌వలీ పక్కకు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లడంతో హైవే పెట్రోలింగ్‌ పోలీసులు గుళ్లాపల్లి టోల్‌గేట్‌ సమీపంలో లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్‌కుమార్‌ తెలిపారు. సంఘటన స్థలాన్ని ఏఎస్సై శేషారెడ్డి, హైవే పెట్రోలింగ్‌ పోలీసులు శశిధర్‌రెడ్డి పర్యవేక్షించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement