మార్కాపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగిపోయాయని, ఫలితంగా నిత్యవసరాలన్నీ ప్రజలకు భారంగా మారాయని సీపీఎం జిల్లా కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ పేర్కొన్నారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకోను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం స్థానిక సీపీఎం కార్యాలయంలో వామపక్షాలు సంయుక్తంగా ఫాంప్లేట్‌ను ఆవిష్కరించాయి. ఈ సందర్భంగా సోమయ్య, ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ.. తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సరఫరా చేస్తామని కొన్ని దేశాలు భారతదేశానికి అవకాశం ఇచ్చినా మోదీ ఉపయోగించుకోలేకపోతున్నారన్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని బూచిగా చూపి దేశ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని మండిపడ్డారు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పొదుపు మాత్రం జపిస్తోందని ఎద్దేవా చేశారు. చౌకగా చమురు అందుబాటులో ఉన్నా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ హయాంలో ధరలన్నీ రెట్టింపు అయ్యాయన్నారు. పెరిగిన ధరలకు తోడు రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు పన్నులు విధించడంతో మరింత భారంగా మారిందన్నారు. నిత్యావసరాలే కాకుండా రైతులకు అవసరమైన ఎరువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడక తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ ప్రజలను సమీకరిస్తామని హెచ్చరించారు. ధరలు తగ్గించేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని చెప్పారు. కమ్యూనిస్టు నాయకులు డీకేఎం రఫీ, షేక్ ఖాశిం, గుమ్మా బాలనాగయ్య, పొదిలి మల్లికార్జున, ఏనుగుల సురేష్ కుమార్, వందన్ కుమార్, కె.వి కృష్ణ గౌడ్, జేవీవీ నాయకులు ఏనుగుల రవికుమార్, గాలి కాశిరెడ్డి, పాల్గొన్నారు.
సీపీఐ, సీపీఎం నాయకుల వెల్లడి
పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్


