మిస్టరీ వీడని దంపతుల అదృశ్యం కేసు | - | Sakshi
Sakshi News home page

మిస్టరీ వీడని దంపతుల అదృశ్యం కేసు

Jun 5 2026 4:47 AM | Updated on Jun 5 2026 4:47 AM

యర్రగొండపాలెం: దంపతుల అదృశ్యం కేసులో ఇంకా చిక్కుముడి వీడలేదు. పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నా వారి ఆచూకీ తెలియడం లేదు. స్థానిక కొలుకుల రోడ్డులో నివాసం ఉంటున్న గోపిదేశి వెంకట లక్ష్మీనారాయణ, పద్మ దంపతులు ఈ ఏడాది ఏప్రిల్‌ 27వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వారు తమ బంధువుల ఇంటికి వెళ్లి ఉంటారని బంధువులంతా భావించారు. గత నెలలో గుంటూరులోని ఒక లాడ్జి నుంచి వారి ఫోన్‌ ద్వారా కుమారుడు రఘుకు కాల్‌ వెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన దంపతులు రెండు రోజుల తర్వాత గుంటూరులోని లాడ్జికి వెళ్లారని, అక్కడ తమ వెంట తీసుకెళ్లిన బట్టల సంచి, రెండు ఫోన్‌లు అక్కడే వదిలేసి ఎటో వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు. వారికి ఇద్దరు వివాహిత కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రఘునాథ్‌ హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడని, పెద్ద కుమార్తె భర్తతో కలహాలతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. కుటుంబంలో ఉన్న సమస్యలతోనే వారు ఇంటి నుంచి వెళ్లి పోయి ఉంటారని భావిస్తున్నారు. దాదాపు 40 రోజులుగా దంపతులు కనిపించకుండా పోవడమే కాకుండా వారి గురించి తగు సమాచారం తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేకంగా ఒక కానిస్టేబుల్‌ను కేటాయించి దర్యాప్తు జరిపిస్తున్నట్లు ఎస్సై దేవకుమార్‌ తెలిపారు. అదృశ్యమైన లక్ష్మీనారాయణ, పద్మ దంపతుల ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement