పొగాకు రైతులతో చెలగాటం | - | Sakshi
Sakshi News home page

పొగాకు రైతులతో చెలగాటం

Jun 5 2026 4:47 AM | Updated on Jun 5 2026 4:47 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

మద్దిపాడు: పొగాకు రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. మండలంలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. వేలం జరుగుతున్న తీరును పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 25 వేల మంది రైతులు పొగాకు పండిస్తున్నారని, వారికి అనుసరిస్తూ దాదాపు లక్ష మంది కూలీలు పనిచేస్తున్నారని, రైతులు నష్టపోతే వీరందరి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో పొగాకు పంట సాగు చేస్తారని, ఆయా జిల్లాల వారీగా ఇన్ని వేల మంది రైతులు రోడ్డున పడటం కూటమి సర్కార్‌కు సంతోషంగా ఉన్నట్లుందన్నారు. పొగాకు రైతుల రోదనలు కూటమి చెవికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో కేజీ పొగాకు రూ.360 వరకు చేరిందని, కానీ కూటమి ప్రభుత్వంలో రూ.150లకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఏదో ఒక వేలంద్రాన్ని సందర్శిస్తే పొగాకు రైతులు కష్టాలు తెలుస్తాయన్నారు. కేవలం ఒక్కరోజు యోగా నిర్వహించడానికి రూ.300 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం పొగాకు రైతుల బాధలు తీర్చడానికి రూ.500 కోట్లు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.200 కోట్లు ఇచ్చి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దిగడంతో రైతులకు మంచి ధరలు లభించాయన్నారు. ధరలు ఇలానే కొనసాగితే బ్యారన్‌కు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఆ నష్టాన్ని తట్టుకోలేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తాయన్నారు. ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు పొగాకు రైతులు రోడ్డెక్కి బేళ్లను తగలబెట్టినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. రెండేళ్లలో ప్రభుత్వం రూ.3.60 లక్షల కోట్లు అప్పులు చేశారని, కేవలం రూ.500 కోట్లు మార్క్‌ఫెడ్‌కు కేటాయిస్తే పొగాకు రైతులు గట్టున పడతారని చెప్పారు. గత ఏడాది పొగాకు రైతులకు మద్దతుగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొదిలి వేలం కేంద్రానికి వస్తే రైతులపై కేసులు పెట్టిన చరిత్ర మీది కాదా అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి బెదిరించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. పార్టీలకతీతంగా పొగాకు రైతులకు అండగా నిలవాల్సిన ఉందన్నారు. మాజీమంత్రి, సంతనూతలపాడు ఇన్‌చార్జి మేరుగ నాగార్జున మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీలో హయాంలో రైతు రాజులాగా బతికితే కూటమి రెండేళ్ల పాలనలో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారన్నారు. రైతుల విషయంలో ఎప్పుడూ వారికి అండగా నిలవాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక వైపు, రైతులకు ఎటువంటి మద్దతు ధర లభించకుండా చేస్తూ ఆ పంట వేయొద్దు ఈ పంట వేయొద్దు అని చెప్పే చంద్రబాబు ఒక వైపని, ఇద్దరి మధ్య తేడా ఏంటో ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్‌ సీపీ వ్యవసాయ విభాగం ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ మారెల్ల బంగారు బాబు, సీనియర్‌ నాయకులు ఇనగంటి పిచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మండవ అప్పారావు, ఉపాధ్యక్షుడు వాకాకోటిరెడ్డి, వ్యవసాయ విభాగం మండల పార్టీ నాయకుడు పల్లకి సత్యనారాయణరెడ్డి, దర్శి ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ కొర్రపాటి శరత్‌ బాబు, సన్నపురెడ్డి రవణమ్మ, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement