డీఎస్సీ లొసుగులపై విచారణ చేయాలి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ లొసుగులపై విచారణ చేయాలి

Jun 2 2026 6:05 AM | Updated on Jun 2 2026 6:05 AM

డీఎస్సీ లొసుగులపై విచారణ చేయాలి

‘ఎక్స్‌’లో ఎమ్మెల్యే తాటిపర్తి డిమాండ్‌

యర్రగొండపాలెం: చంద్రబాబు ప్రభుత్వంలో చోటు చేసుకున్న డీఎస్సీ–2025లో మెగా లొసుగులపై సైబర్‌ క్రైం నిపుణులు, సిట్టింగ్‌ జడ్జితో కూడిన హైలెవెల్‌ టెక్నికల్‌ కమిటీతో విచారణ జరిపించి, పరీక్షా సర్వర్ల ఐటీ ఆడిట్‌ రిపోర్టును బహిర్గతం చేయాలని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం మెగా డీఎస్సీ కుంభకోణంపై ఆయన ‘ఎక్స్‌’లో స్పందించారు. ఈ కుంభకోణంపై వివరణ ఇవ్వటానికి పాఠశాలల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ పడిన పాట్లు చూస్తుంటే జాలి వేస్తుందని, మంత్రి లోకేష్‌ ఇవ్వాల్సిన వివరణ చాకచక్యంగా తప్పించి ఐఏఎస్‌ అధికారిని బలి పశువును చేయడం బాధాకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మెగా డీఎస్సీ కుంభకోణంపై నిరుద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నారా లోకేష్‌ సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. అత్యంత కఠినంగా ఉండే డీఎస్సీ సిలబస్‌లో నెగిటివ్‌ మార్కులు లేకపోయినా మీ దగ్గర పనిచేసే ఒక సాధారణ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ రావడం వెనక ఎవరి అండదండలు ఉన్నాయని, సర్వర్‌ లాగ్స్‌ ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఈ వివాదం బయటకు రాగానే విద్యాశాఖ సదరు అభ్యర్ధి అభ్యర్ధిత్వం రద్దు చేసి చేతులు దులుపుకుందన్నారు. అభ్యర్ధిత్వాన్ని రద్దు చేయడం కాదు, అతను ఏ కంప్యూటర్‌ సిస్టం నుంచి పరీక్ష రాశాడు... ఆ సిస్టం ఐపీ అడ్రస్‌ ఏమిటి.. పరీక్ష రాస్తున్నప్పుడు సర్వర్‌లో ఏమైనా అసాధారణ యాక్టివిటీ జరిగిందా అన్నది ఎందుకు తేల్చలేదని నిలదీశారు. డేటా డిలీషన్‌ ఎందుకు చేశారని, తప్పు చేయనప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో ఆ అభ్యర్థి పేరు, వివరాలను అర్ధరాత్రి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల యాక్సెస్‌ కంట్రోల్‌ లాగ్‌ ఎవరి దగ్గర ఉన్నాయి... ఎవరెవరు లాగిన్‌ అయ్యారని చెప్పటానికి ఎందుకు భయపడుతున్నారన్నారు. డీఎస్సీ పరీక్ష కేంద్రాల్లోని సిస్టం టెక్నికల్‌ ఆడిట్‌ జరిపించారా.. ఒక ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి అంశం కాదు సెలెక్టెడ్‌గా కొంతమంది ఎగ్జాం సిస్టం రిమోట్‌ యాక్సెస్‌ అయిందని నిరుద్యోగుల సంఘాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఒరిజినల్‌ టెట్‌ కన్వీనర్‌ను ఉన్నపళంగా మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అభ్యర్థుల ప్రశ్నలకు లోకేష్‌ సమాధానం ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement