న్యూస్‌రీల్
వేసవి తీవ్రతతో చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి బోర్లలోనూ నీరు అడుగంటుతోంది. పల్లె, పట్నం తేడా లేకుండా జనం నీటి కోసం అల్లాడుతున్నారు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో అధిక శాతం వ్యవసాయం బోర్లపైనే ఆధారపడి చేస్తున్నారు. పరిమితికి మించి వాడటంతో నీటి కొరత మరింత తీవ్రమైంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 91 గ్రామాల్లో కొత్త బోర్లపై ప్రభుత్వం నిషేధం విధించింది.
మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. మార్కాపురం నియోజకవర్గంలో 22 గ్రామాలు, కనిగిరి నియోజకవర్గంలో 18 గ్రామాలు, గిద్దలూరు పట్టణంతో పాటు 10 గ్రామాల్లో, యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో 20 గ్రామాల్లో నీటి సమస్య నెలకొంది. వీటితో పాటు ప్రకాశం జిల్లాలోని దర్శి, అద్దంకి, కొండపి, కందుకూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో తాగునీటి కొరత వేధిస్తోంది. బోర్లలో నీరు అడుగంటడంతో పాటు ట్యాంకర్ల ద్వారా కూడా నీటి సరఫరా కాకపోవడంతో జనం నీటి కోసం రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
● అడుగంటుతున్న భూగర్భ జలాలు
● పరిమితికి మించి వాడటంతో మంచినీటికి డేంజర్ బెల్స్
● ఉమ్మడి జిల్లాలో 91 గ్రామాల్లో కొత్త బోర్లపై నిషేధం
● తాగు, సాగునీటికి అల్లాడుతున్న జనం
91 గ్రామాల్లో బోర్లు నిషేధం
జిల్లాలో మొత్తం 91 గ్రామాల్లో నూతన బోర్లను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాల్టా చట్టం పటిష్టంగా అమలుచేస్తాం. ప్రజలు నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న నేపథ్యంలో ప్రతి నీటిబొట్టు విలువైనదే. నీటి వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం. విచ్చలవిడిగా బోర్లువేసి నీటిని వృథా చేయడం మానుకోవాలి. వర్షపు నీటిని నిల్వచేసుకునేందుకు రైతులు పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి. ఉద్యాన పంటలు సాగుచేస్తున్న రైతులు డ్రిప్ సిస్టంను వాడుకోవాలి.
– జీ శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్, గ్రౌండ్ వాటర్, ఒంగోలు
మార్కాపురం:
రోజురోజుకూ ఎండలు ఎక్కువ కావడం, మూడు నెలల నుంచి జిల్లాలో వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో జిల్లాలోని 12 మండలాల్లో ఉన్న 91 గ్రామాల్లో పరిమితికి మించి నీటి వాడకం ఉండటంతో కొత్తబోర్లను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం జిల్లాలో ఎక్కువ భాగం రైతులు పంటల సాగుకు బోర్ల ద్వారా నీటిని వినియోగిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మార్కాపురం, కంభం, దొనకొండ, దోర్నాల, గిద్దలూరు, కురిచేడు, ముండ్లమూరు, పెద్దారవీడు, పుల్లలచెరువు, రాచర్ల, త్రిపురాంతకం, వైపాలెం మండలాల్లో ప్రమాదకరమైన స్థితిలోకి భూగర్భ జలాలు వెళ్లిపోయాయి.
ఈ గ్రామాల్లో కొత్త బోర్లు నిషేధం:
కంభం మండలంలోని కంభం, జంగంగుంట్ల, కందులాపురం, ఎల్‌కోట, దొనకొండ మండలంలోని అనంతవరం, కొచ్చర్లకోట, మల్లంపేట, మంగినిపూడి, రుద్రసముద్రం, దోర్నాల మండలంలోని చిన్నదోర్నాల, దోర్నాల, నల్లగుంట్ల, పెద్దబొమ్మలాపురం, ఎగువచెర్లోపల్లి గ్రామాల్లో నూతన బోర్లకు అనుమతిని ప్రభుత్వం నిషేధించింది. గిద్దలూరు మండలంలోని చట్టిరెడ్డిపల్లి, గడికోట, కంచుపల్లి, క్రిష్ణంశెట్టిపల్లి, మోడంపల్లి, ముండ్లపాడు, నర్సింహునిపల్లి, సంజీవరాయునిపేట, తిమ్మాపురం, కురిచేడు మండలంలోని ఆవులమంద, కల్లూరు, ముష్లగంగవరం, వెస్ట్ కాశీపురం, మార్కాపురం మండలంలోని బడేఖాన్‌పేట, భూపతిపల్లి, బొందలపాడు, చింతగుంట్ల, జమ్మనపల్లి, కోలభీమునిపాడు, మాల్యవంతునిపాడు, నికరంపల్లి, పెద్దనాగులవరం, వేములకోట, ముండ్లమూరు మండలంలోని ఈదర, జమ్మలమడక, కంభంపాడు ఈస్టు, కొమ్మవరం నూజెళ్లపల్లి, పూరిమెట్ల, పెద్దారవీడు మండలంలోని బద్వీడు, బోయదగుంపుల, చట్లమిట్ల, కంభంపాడు, దేవరాజుగట్టు, గొబ్బూరు, ఒబులక్కపల్లి, పెద్దారవీడు, ప్రగళ్లపాడు, ఎస్ కొత్తపల్లి, సానికవరం, తంగిరాలపల్లి, తోకపల్లి గ్రామాల్లో కొత్త బోర్లను ప్రభుత్వం నిషేధించింది. పుల్లలచెరువు మండలంలోని అయ్యగారిపల్లి, చాపలమడుగు, చెన్నపాలెం, చౌటపాచర్ల, చౌటపల్లి, గారపెంట, ఇసుక త్రిపురవరం, కవలకుంట్ల, కొమరోలు, మానేపల్లి, మర్రివేముల, ముటుకుల, నర్సాపురం, పుల్లలచెరువు, రాచకొండ, శతకోడు, యండ్రపల్లి, రాచర్ల మండలంలోని ఆకవీడు, చినగానిపల్లి, చోళ్లవీడు, త్రిపురాంతకం మండలంలోని గణపవరం, లేళ్లపల్లి, మాధవవానిపల్లి, మేడపి, నర్సింగాపురం, రామసముద్రం, విశ్వనాథపురం గ్రామాల్లో కొత్తబోర్లు వేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. యర్రగొండపాలెం మండలంలోని అల్లీపాలెం, అమానిగుడిపాడు, బిళ్లగొందిపెంట, గుర్రపుసాల, లింగంవానిపల్లి, మిళ్లంపల్లి, రామచంద్రాపురం, యర్రగొండపాలెం గ్రామాల్లో కొత్తబోర్లను ప్రభుత్వం నిషేధించింది.
అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో మార్కాపురం, యర్రగొండపాలెం, తర్లుపాడు, రాచర్ల, త్రిపురాంతకం, పుల్లలచెరువు, పెద్దారవీడు, గిద్దలూరు, దోర్నాల, దొనకొండ మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 8 మీటర్లు దాటితే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినట్టే లెక్క. దీంతో డీప్‌బోర్లు కూడా పనిచేయని పరిస్థితి ఏర్పడుతోంది. పశ్చిమ ప్రకాశంలోని పలు గ్రామాల్లో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఏప్రిల్ 12 నాటికే తీవ్రత ఎక్కువగా ఉంది. మేనెల పూర్తయ్యేటప్పటికి పరిస్థితి మరింత దిగజారింది.
నాతనంపల్లిలో డీప్ బోరు ఎండిపోయి నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకు
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న దర్శి మండలం చలివేంద్రం గ్రామస్తులు (ఫైల్)
తీవ్రమవుతున్న తాగునీటి సమస్య


