వైఎస్సార్‌పై విద్వేష పూరిత వ్యాఖ్యలా.. | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌పై విద్వేష పూరిత వ్యాఖ్యలా..

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

మహాన్యూస్‌ వంశీ, శ్రీనివాసరాజుల వ్యాఖ్యలపై చింతలపూడి మండిపాటు వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు మహానేత వైఎస్సార్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలా..

అద్దంకి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో అవమానకరంగా మాట్లాడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అద్దంకి పోలీస్‌ స్టేషన్‌లో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చింతలపూడి అశోక్‌ కుమార్‌ ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చింతలపూడి అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ మహా న్యూస్‌ ఛానల్‌కు చెందిన వంశీ అనే వ్యక్తి, అలాగే శ్రీనివాసరాజు అనే వ్యక్తి ప్రజా వేదికలపై, సోషల్‌ మీడియా వేదికగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ గురించి అత్యంత అవమానకరంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఓ గొప్ప ప్రజా నాయకుడిని ఉద్దేశించి ఈ తరహా వికృత వ్యాఖ్యలు చేయడం వల్ల కోట్లాది మంది వైఎస్సార్‌ అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని, వైఫల్యాలను బయటపెట్టిన ప్రతిసారీ, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరలేపుతోందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరిగాయో, అర్హులైన అభ్యర్థులు ఏ విధంగా నష్టపోయారో ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతోందన్నారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌ సీపీ ఉద్యమం మొదలుపెట్టగానే కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. అలాగే మొన్న కురిసిన వర్షాలకు అమరావతిలో ఏ విధంగా నీరు చేరిందో అందరికీ తెలుసన్నారు. దాన్ని పక్కదారి పట్టించేందుకు గండ్లు కొట్టి పొలాల్లోకి వదలడం వల్ల రైతులు ఎంతలా ఇబ్బంది పడ్డారో అందరూ చూశారన్నారు. ఈ వైఫల్యాలన్నింటినీ పక్కదోవ పట్టించేందుకే సరికొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. మహానేతపై చేసిన వీడియో ఆధారాలను పరిశీలించి, మహా న్యూస్‌ వంశీ, శ్రీనివాసరాజులపై భారతీయ న్యాయ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ గుజ్జుల జగన్‌మోహన్‌రెడ్డి, ముస్లిం మైనారిటీ సెల్‌ నాయకుడు బాజీ, మాజీ కౌన్సిలర్‌ బాషా, వాణిజ్య విభాగం నాయకుడు ఊడత్తు సురేశ్‌, న్యాయ విభాగం నాయకుడు న్యాయవాది రమేశ్‌, మోటుపల్లి శివరమకృష్ణ, కే శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement