కొత్తపట్నం:
‘ఇష్టం వచ్చినట్లు మట్టి తవ్వకాలు చేస్తే రైతులు అన్యాయమవుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం చెరువు మట్టిని అక్రమంగా తరలించడం అన్యాయ’మని పలువురు నాయకులు ఖండించారు. మండలంలోని అల్లూరులో చాపాయి, చక్రాయి ఇరిగేషన్ చెరువు 1800 ఎకరాలు ఉంది. ఈ చెరువు కింద వేలాది ఎకరాలు చిన్న, సన్నకారు రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకుడు కొప్పోలులో వేస్తున్న వెంచర్ల కోసం అల్లూరులోని చాపాయి, చక్రాయి ఇరిగేషన్ చెరువులో వారం రోజుల నుంచి మట్టిని తవ్వుతున్నారు. దీనిపై గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అల్లూరులో ఆదివారం వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ, గ్రామస్తులు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈసందర్భంగా వైఎస్సార్ సీపీ మండల అద్యక్షుడు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ 2014 టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ నీరు–చెట్టు పథకం పేరుతో మట్టిని విచ్చలవిడిగా అమ్ముకున్నారన్నారు. ఇప్పుడు మళ్లీ జలహారతి, జలధార పథకాలు పెట్టి మట్టిని ఇష్టం వచ్చినట్లు తవ్వుకుంటూ అక్రమంగా తరలిస్తున్నారన్నారు. ఈ పథకాల ఉద్దేశం శ్మశానాల లెవలింగ్, ప్రభుత్వ రోడ్లు, ప్రభుత్వ భవనాలకు, చెరువులు అభివృద్ధి కోసమేనని, కానీ టీడీపీ నేతలు అధికారం ఉందని చెరువు నుంచి అక్రమంగా తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. చెరువులో ఇష్టంవచ్చినట్లు తవ్వకాలు చేస్తే చెరువు ఉప్పునీరుగా మారుతుందన్నారు. వెంటనే మట్టి దోపిడీని ఆపాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర విభాగం జనరల్ సెక్రటరీ ఆళ్ల రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ చెరువు కింద ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్న కారు రైతులు బతుకున్నారని, వారికి పదో, ఇరవై బస్తాల వడ్లు పండుతాయని, అవి పండకుంటే చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఒంగోలు మండలంలో, కొప్పోలులో చాలా చెరువులు ఉన్నాయని, అక్కడ తోలుకోవచ్చని, కానీ అక్కడ గ్రామస్తులు వ్యతిరేకించేసరికి ఇక్కడకు వచ్చారన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలోనే చెరువును అభివృద్ధి చేశామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామలింగం వెంకట్రావు మాట్లాడుతూ చెరువు మట్టిని గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఉపయోగించాలే తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం కాదన్నారు. పంచాయతీ అధికారులను సంప్రదించకుండా నేరుగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుకొని ఎలా మట్టి తవ్వుతారని ప్రశ్నించారు. సీపీఎం నాయకుడు ఎస్ స్వామిరెడ్డి మాడ్లాడుతూ చాప్రాయి, చక్రాయి చెరువు నుంచి ఇష్టం వచ్చినట్లు మట్టిని తవ్విస్తే నీరు ఉప్పుగా మారి రైతుల పొలాలు పండవన్నారు. జలహారతి, జలధార పథకం ద్వారా గ్రామాలు, చెరువులు అభివృద్ధి చేయాలే తప్ప వెంచర్లకు మట్టి తోలడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎంపీటీసీ మిట్నసల శాంతారావు మాట్లాడుతూ ఈ చెరువులో లోతుగా మట్టి తోలడం వల్ల ఇద్దరు దళిత పిల్లలు గుంతలో పడి చనిపోయారని గుర్తు చేశారు. చెరువులో మట్టి తవ్వకాలు ఇష్టం వచ్చినట్లు చేస్తే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. గ్రామస్తుల అనుమతి లేకుండా ఏ విధంగా మట్టి తవ్వి వెంచర్లకు తరలిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో సామంతుల తోటారెడ్డి, వి.రామచంద్రారెడ్డి, జెట్టి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామలింగారెడ్డి, స్వర్ణ శివారెడ్డి, శ్రీనారెడ్డి, బుర్ల సుధాకర్‌రెడ్డి, కె. చిట్టిబాబు, తుళ్లూరి వెంకటనారాయణ, మల్లిఖార్జున, ఎం. హరిబాబు, తాతా నాంచార్లు, తంబి వెంకటేశ్వర్లు, బేల్దారి నాగరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇష్టం వచ్చినట్లు తవ్వేస్తే పంటలకు ఇబ్బంది
రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం రైతులకు అన్యాయం చేయొద్దు
పంచాయతీ అనుమతి లేకుండా ఎలా తవ్వకాలు చేస్తారు
విలేకరుల సమావేశంలో ప్రశ్నించిన పార్టీల నేతలు


