● వ్యక్తికి తీవ్ర గాయాలు
పామూరు: మద్యం మత్తులో వ్యక్తితో గొడవపడి కత్తితో దాడి చేసిన ఘటన శనివారం రాత్రి మండలంలోని బొట్లగూడూరులో జరిగింది. ఎస్సై కట్టా అనూక్ తెలిపిన వివరాలు... పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కోమటిగుంట్ల శివ శనివారం పామూరు మండలం కోడిగుంపల గ్రామంలోని తన బావ మహేంద్ర ఇంటికి వచ్చాడు. ఇద్దరు కలిసి నెల్లూరుజిల్లా వరికుంటపాడు మండలం వేంపాడు గ్రామంలో జరిగే తిరునాళ్లకు వెళుతున్నారు. మార్గమధ్యంలో బొట్లగూడూరు గ్రామానికి చేరుకున్న వారు అక్కడ మజ్జిగ తాగి వెళ్దామని దుకాణం వద్ద ఆగాడు. ఆ సమీపంలో బొట్లగూడూరు గ్రామానికి చెందిన ఆవుల వేణుగోపాల్ అనే వ్యక్తి కేకలు వేస్తుండగా ఎందుకు అరుస్తున్నావని ప్రశ్నించారు. దీంతో వేణుగోపాల్ పక్కనే ఉన్న కత్తి తీసుకొని శివ గొంతుపై పొడవడంతో తీవ్ర గాయమైంది. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో ఆ వాహనంలో కందుకూరు వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలుప్ర భుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడు శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్యశాలకు వెళ్లి క్షతగాత్రుని పరిశీలించిన ఎస్సై కట్టా అనూక్ కేసునమోదుచేసి దర్యాప్తుచేస్తున్నాడు.


