గాలివాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం

May 31 2026 1:42 AM | Updated on May 31 2026 1:42 AM

పెద్దదోర్నాల అయ్యప్పస్వామి దేవాలయం వద్ద విరిగిన విద్యుత్‌ స్తంభం

పెద్దదోర్నాల మండల కేంద్రంలో కురుస్తున్న వర్షం

కర్నూలు–గుంటూరు జాతీయ రహదారిపై నేలకూలిన చెట్టు

పెద్దదోర్నాల: గాలివాన బీభత్సం సృష్టించడంతో కొన్ని గంటల పాటు జనజీవనం అస్తవ్యస్తమైంది. పెద్దదోర్నాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు గంటన్నర పాటు తీవ్ర స్థాయిలో గాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి మండల కేంద్రం అతలాకుతలమైంది. గాలివాన తీవ్రతకు మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, చెట్ల కొమ్మలతో పాటు పలు దుకాణాలకు సంబంధించిన పైకప్పు రేకులు నేలకూలాయి. స్థానికంగా శ్రీశైలం రహదారిలో ఉన్న అయ్యప్పస్వామి దేవాలయం వద్ద ఓ విద్యుత్‌ స్తంభం విరిగిపడింది. ఆ స్తంభానికి ఉన్న విద్యుత్‌ తీగలు రోడ్డుపై వేలాడుతూ ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పాటు శ్రీశైలం రహదారిలోని పలు దుకాణాలకు సంబంధించిన పైకప్పు, రేకులు నేలకూలాయి. కర్నూలు, గుంటూరు రహదారిలోని యడవల్లి వద్ద తిరుమలనాథస్వామి ఆలయ సమీపంలో ఓ భారీ వృక్షం నేలకూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానిక ఎస్సై వెంకట రమణయ్య హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. శ్రీశైలం రహదారిలో రోడ్డుకు ఇరువైపులా కొందరు యజమానులు వారి వారి స్థలాలను ఎత్తు పెంచుకోవటంతో భారీగా వర్షం నీరు పల్లంలోకి చేరి ఆ ప్రాంతమంతా చెరువును తలపించింది. దీంతో మోకాళ్ల లోతుకు చేరిన వర్షం నీటిలో ప్రయాణించేందుకు పలుపురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రతకు అల్లాడిన మండల ప్రజలు శనివారం కురిసిన భారీ వర్షానికి సేద తీరారు.

పత్తి పంటలో భారీగా చేరిన వర్షం నీరు

పెద్దదోర్నాల మండలంలో కురిసిన వర్షానికి మండల పరిధిలోని ఐనముక్కల, యడవల్లి తదితర ప్రాంతాల్లో సాగులో ఉన్న పత్తి పంటలో భారీగా నీరు నిలిచింది. ఆయా ప్రాంతాల్లోని నర్సరీలు గాలివాన తీవ్రతకు నేలవాలడంతో రైతులకు నష్టం వాటిల్లింది.

పత్తి పంటలో నిలిచిన వర్షం నీరు

రోడ్డుపై చెట్లు నేలకూలడంతో కర్నూలు–గుంటూరు రహదారిపై నిలిచిన వాహనాలు

పెద్దదోర్నాలలో గంటన్నర పాటు ఈదురుగాలులతో భారీ వర్షం

అయ్యప్పస్వామి ఆలయం వద్ద నేలకొరిగిన విద్యుత్‌ స్తంభం

కర్నూలు – గుంటూరు రహదారిపై కూలిన భారీ వృక్షం

వర్షం నీరు చేరి చెరువును తలపించిన శ్రీశైలం రహదారి

Advertisement
 
Advertisement
Advertisement