● అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైలు ఎక్కేందుకు తీవ్రంగా ఇబ్బందిపడిన ప్రయాణికులు
సింగరాయకొండ: సింగరాయకొండ రైల్వేస్టేషన్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా శనివారం ఉదయం పినాకిని ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేందుకు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. పినాకినీ రైలు ప్రతిరోజూ రెండో నంబర్ ప్లాట్‌ఫాంపైకి వస్తుంటుంది. శనివారం మాత్రం అధికారులు రైలు వచ్చే ముందుగా ప్లాట్‌ఫాం నంబర్ మార్చడంతో పాటు మార్చిన ప్లాట్‌ఫాంపైకి కాకుండా మరో ట్రాక్‌పైకి రావడంతో ప్రయాణికులు నానా రకాలుగా అవస్థ పడ్డారు. చెన్నె వైపు వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్ రోజూలాగే రెండో నంబర్ ప్లాట్‌ఫాంపైకి రావాల్సి ఉంది. కానీ, చివరి క్షణంలో మూడో నంబర్ ప్లాట్‌ఫాంపైకి వస్తుందని ప్రకటించారు. దీంతో ప్రయాణికులంతా రెండో నంబర్ నుంచి మూడో నంబర్ ప్లాట్‌ఫాంపైకి పరుగులు తీశారు. తీరా చూస్తే.. రైలు మూడో నంబర్ ప్లాట్‌ఫాంపైకి కూడా రాకుండా ఆ రెండు ప్లాట్‌ఫాంల మధ్య ఉన్న లూప్‌లైన్‌లోకి వచ్చి ఆగింది. దీంతో ఆ రైలు ఎక్కేందుకు ప్లాట్‌ఫాం లేకుండా పోయింది. అప్పటికే మూడో నంబర్ ప్లాట్‌ఫాంపైకి పరుగులు తీసి ఉన్న వందలాది మంది ప్రయాణికులు లూప్‌లైన్‌లో ఆగిన రైలు ఎక్కేందుకు పట్టాలపైకి దిగి మళ్లీ పరుగులు పెట్టారు. బ్యాగులు, పసిపిల్లలతో ఉన్న వారితో పాటు మహిళలు, వృద్ధులు రైలు ఎక్కేందుకు నరకం చూశారు. రైలు దిగాల్సిన వారు సైతం రెండువైపులా ప్లాట్‌ఫాంలు లేకపోవడంతో నానా తంటాలు పడ్డారు. సింగరాయకొండ రైల్వేస్టేషన్లో ఇటీవల ఇలా జరగడం నిత్యకృత్యమైందని, రైల్వే అధికారులు ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.


