మార్కాపురం టౌన్: పట్టణంలో రెండు రోజులుగా గోవులను వధిస్తూ మాంసాన్ని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్టు ఎస్సై విశ్వనాథరెడ్డి శనివారం తెలిపారు. గోవులను ఎవరైనా వధించి మాంసాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోవధ, గోవులను తరలించే విషయంపై సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలపాలని కోరారు.
ఒంగోలు టౌన్: జిల్లాలోని సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై కే కమలాకర్, దర్శి పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎం.మురళి, టాస్క్‌ఫోర్స్ ఎస్సై వెంకట కృష్ణయ్యలను ఎస్పీ హర్షవర్దన్‌రాజు శనివారం అభినందించారు. పదోన్నతి పొందిన ఎస్సైలు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
బల్లికురవ: తిరుపతి వెంకన్నస్వామి దర్శనానికి కాలినడకన వెళ్తున్న బృందంలో ఓ యువకుడిని గుర్తు తెలియని కారు ఢీకొనడంతో చికిత్స పొంది ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి మృతిచెందాడు. శనివారం మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు బల్లికురవ ఎస్సై వై.నాగరాజు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బల్లికురవ మండలంలోని కొప్పరపాడు గ్రామానికి చెందిన గాలి నాగరాజు (40) అదే గ్రామానికి చెందిన మరికొంతమందితో కలిసి ఈ నెల 24వ తేదీ తిరుపతికి కాలినడకన వెళ్తుండగా, ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలైన నాగరాజును 108 వాహనంలో కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొంతమేరకు కోలుకోవడంతో రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు గ్రామానికి తీసుకొచ్చారు. కానీ, గాయాల నుంచి పూర్తిగా కోలుకోనందున పరిస్థితి విషమించి చనిపోయినట్లు పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే నాగరాజు మృతితో గ్రామంలో విషాదం అలముకుంది.


