● నడుముకు తాడుతో రాయి
● అనుమానాస్పదస్థితిలో గుర్తుతెలియని యువకుడి మృతి
సింగరాయకొండ: సుమారు 28 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని యువకుడికి నడుముకు తాడుతో రాయి కట్టి పాడుబడిన బావిలో పడేసిన సంఘటన శనివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. మండలంలోని పాతసింగరాయకొండ పంచాయతీ వరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన దేవునితోటలో ఉన్న పాడుబడిన బావిలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం బావి పరిసరాలలో దుర్వాసన వస్తుండటంతో గ్రామస్తులు బావి వద్దకు వెళ్లి చూశారు. యువకుని మృతదేహం తేలాడుతూ ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు.. యువనేస్తం ఫౌండేషన్ సభ్యుల సహకారంతో మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. అతని ఒంటికి తాడు కట్టిన రాయి ఉంది. మొహం బాగా ఉబ్చి ఉంది. మోహంపై పురుగులు పాకటంతో గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉందని పోలీసులు తెలిపారు. ఒంటిమీద ఎటువంటి గాయాలు లేవన్నారు. ఎర్ర రంగు టీషర్టు, బులుగు రంగు నైట్ ప్యాంటు ధరించి ఉన్నాడని చెప్పారు. అయితే, ఇది ముమ్మాటికీ హత్యేనని స్థానికులు ఆరోపిస్తుండగా.. పోలీసులు మాత్రం ఇది హత్యా.. లేక ఆత్మహత్య అనేది తమ విచారణలో తేలుతుందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ పి.శ్రీహరి పరిశీలించారు. మృతదేహం ఉన్న స్థితిని బట్టి ఘటన జరిగి మూడు రోజులై ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్.సుధీర్‌కుమార్ తెలిపారు.


