● ఎన్టీఆర్ విగ్రహం ప్రారంభంలో వివాదం
● ఆవిష్కరించిన టీడీపీ ఎన్‌ఆర్‌ఐ
● మళ్లీ కొందరు టీడీపీ నేతలు ముసుగు వేయడంతో ఘర్షణ
ఉలవపాడు: ఉలవపాడులో ఏర్పాటు చేసిన ఎన్‌టీ రామారావు విగ్రహం వివాదాలకు కేంద్రంగా మారింది. చివరికి తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఉలవపాడు బస్డాండ్ సెంటర్‌లో ఏడేళ్ల క్రితం ఎన్‌టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. నిర్మాణ సమయంలో స్థలం విషయంలోనూ పలు వివాదాలు వచ్చాయి. అప్పుడు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే పోతుల రామారావు సహకారంతో స్థానిక టీడీపీ నాయకులు చందాలు వేసుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విగ్రహాన్ని ఆవిష్కరించలేదు. పెద్ద నాయకులు వస్తారు.. చేయించాలని చెప్పి ఏడేళ్లు గడిచిపోయింది. అప్పటి నుంచి ముసుగు తీయలేదు. ఈ నేపథ్యంలో మహానాడు పూర్తయిన తరువాత గురువారం ఎన్టీఆర్ జయంతి నాడు ఉలవపాడుకు చెందిన ఒక ఎన్‌ఆర్‌ఐ తన కార్యకర్తలతో వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సదరు ఎన్‌ఆర్‌ఐ అనుచరుని కుమార్తె విగ్రహం ఏర్పాటుకు అధిక నగదు ఇచ్చినట్లు సమాచారం. అయితే, తమకు తెలియకుండా ఎలా ఆవిష్కరిస్తారంటూ కొందరు తెలుగు తమ్ముళ్లు, పదవుల్లో ఉన్న వారు కలిసి మళ్లీ విగ్రహానికి ముసుగు వేశారు. శనివారం మళ్లీ సదరు ఎన్‌ఆర్‌ఐ వచ్చి ముసుగు తీసి దండలు వేశారు. మళ్లీ టీడీపీ నాయకులు వచ్చి ముసుగు వేయడంతో మండలంలో వివాద వాతావరణం నెలకొంది. శనివారం విగ్రహం వద్దకు వచ్చిన ఎన్‌ఆర్‌ఐపై అదే పార్టీకి చెందిన మండల స్థాయి నాయకుడు, అతని కుమారుడు దాడి చేసినట్లు పోలీసులకు సదరు ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ నేతలకు మద్దతుగా కొల్లూరుపాడు, ఆత్మకూరు నుంచి మరో ఇద్దరు నేతలు వచ్చి ముసుగు వేసినట్లు తెలిసింది. విగ్రహం ముసుగు వేయడం.. తీయడం వలన ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పెద్దనేత మాత్రం ఈ సమస్య పెద్దది కాకుండా చూడాలని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.


