చీమకుర్తి:
జిల్లాలోని చీమకుర్తి పరిసరాల్లో వందకుపైగా చిన్నా, పెద్దా క్వారీలు ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వల రాబడికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న గ్రానైట్ పరిశ్రమ నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుతం గ్రానైట్ ఎగుమతులు దాదాపు సగానికి పైగా తగ్గిపోయాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ పెనుభారంగా మారింది. క్వారీలను నడపలేక యజమానులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అందులో ప్రధానంగా రామతీర్థానికి ఉత్తరం, పడమర కేంద్రంగా ఎర్రకొండ నుంచి కర్నూల్ రోడ్డు వరకు, ఆర్‌ఎల్‌పురం, బూదవాడ సరిహద్దు పరిధిలోనున్న గ్రానైట్ క్వారీలు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కర్నూల్ రోడ్డుకు ఉత్తరం వైపు ఉన్న క్వారీల్లో నాణ్యత లేని గ్రానైట్ కారణంగా కంపెనీలు పూర్తిగా దెబ్బతిని మూతపడగా, మరికొన్ని సబ్‌లీజుల పేరుతో కనాకష్టంగా నడుపుకొస్తున్నారు. దాదాపు 20కి పైగా క్వారీలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని సంకేతాలు వస్తున్నాయి.
భారంగా మారిన రాయల్టీ..
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గ్రానైట్ క్వారీలు చెల్లించాల్సిన రాయల్టీని భారీగా పెంచటం, వసూళ్ల బాధ్యత ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించటం క్వారీలకు మరింత కష్టకాలంగా మారింది. కరోనా కాలం నుంచి ఎగుమతులు కూడా పూర్తిగా దెబ్బతిన్నా ఇటీవల కొద్దో గొప్పో కోలుకుంటుందనుకుంటున్న దశలో పశ్చిమాసియా యుద్ధం గ్రానైట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. పుండుమీద కారం చల్లినట్లు ఎగమతులు లేక, భారంగా మారిన గ్రానైట్ క్వారీలకు పెరిగిన డీజిల్ భారం మరింత అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితులు కల్పించాయి. రోజుకు సరాసరిన 70 వేల లీటర్ల డీజిల్ కావాల్సి వస్తుందని గ్రానైట్ యజమానులు చెబుతున్నారు. నెల రోజుల క్రితం వరకు రూ.97 ఉన్న డీజిల్ తాజాగా రూ.112కు పైగా పెరగటం, ఇండస్ట్రీ అవసరాలకు అయితే లీటర్ రూ.150కు పైగా ధర ఉండటం గ్రానైట్ పరిశ్రమపై మరింత భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ తీరుతో మరిన్ని కష్టాలు..
అప్పుల్లో కూరుకుపోయి అమ్మకానికి కూడా సిద్ధంగా ఉన్న గ్రానైట్ పరిశ్రమ మనగడకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఏమాత్రం ఊరట లభించడంలేదని క్వారీ యజమానులు వాపోతున్నారు. సహకారం అందించకపోగా ఉన్న రాయల్టీని ఏజన్సీల ద్వారా పెంచటం, క్వారీలను రెన్యువల్ చేయకుండా నెలల తరబడి ముడుపుల కోసం వేధించటం వంటి కారణాలతో యజమానులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వేధింపులు భరించేకంటే క్వారీలను అమ్ముకొని పోతేనే మేలేమోనని యజమానులు అంటున్నారు. క్వారీల నుంచి దోచుకుందామనే ఆలోచనే తప్ప కాస్త అండగా నిలిచి గ్రానైట్ పరిశ్రమను ఆదుకుందామనే ఆలోచన అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి ఏమాత్రం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కార్మికులపై తీవ్ర ప్రభావం..
గ్రానైట్ పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుండడంతో దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఇరాన్ యుద్ధం, వేసవి ఎండలు, బెంగాల్ ఎన్నికల కారణంగా ఊర్లకు పోయిన కార్మికులు తిరిగి రాకపోవడం, ఉన్న కార్మికులకే ఉపాధి అవకాశాలు దెబ్బతినటంతో కార్మికుల జీవితాలు కకావికలమవుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు.


