పెండింగ్‌లో 3 లక్షల డీఎల్, ఆర్‌సీ డిజిటల్ కార్డులు ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా జారీకాని లైసెన్సు కార్డులు ఉమ్మడి జిల్లాలో 4 రవాణా శాఖ కార్యాలయాలు రోజుకు సగటున 300 డీఎల్, ఆర్‌సీలు జారీ వాహనదారుల నుంచి సుమారు రూ.4.53 కోట్లు వసూలు ఒరిజినల్ కార్డుల్లేక అవస్థలు పడుతున్న వాహనదారులు
మార్కాపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండేళ్ల నుంచి రవాణాశాఖ ఆధ్వర్యంలో జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సు (డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) డిజిటల్ కార్డులు జారీ కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖకు మార్కాపురం, ఒంగోలు, దర్శి, కందుకూరుల్లో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. మార్కాపురం జిల్లా కావడంతో ప్రత్యేకంగా ఆర్టీఓను కూడా నియమించారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పనిచేస్తున్న అధికారిని మార్కాపురం జిల్లాకు ఇన్‌చార్జి ఆర్టీఓగా నియమించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు సగటున 300 డీఎల్, ఆర్‌సీలు జారీ చేస్తున్నారు. అయితే పర్మినెంటు కార్డులు ఇవ్వకపోవడంతో వాహన యజమానులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా టూ వీలర్లు, కార్లలో వెళ్లేవారు, పోలీసులు, రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు కచ్చితంగా వ్యక్తి డ్రైవింగ్ లైసెన్సు, వాహనానికి సంబంధించిన ఆర్‌సీని అడుగుతున్నారు. అయితే వాహనదారుల వద్ద ఇలాంటివి లేకపోవడంతో తనిఖీ అధికారులకు తాము కట్టిన చలానాలు సెల్‌లో చూపుతున్నారు. కొంత మంది అధికారులు తమకు కచ్చితంగా డీఎల్‌లు, ఆర్‌సీలు చూపాలని పట్టుబడుతుండటంతో ఆ సమయంలో వాహనదారులు నానా అవస్ధలు పడుతున్నారు.
రూ.4.53 కోట్లు వసూలు..
రవాణాశాఖల అధికారులు వాహనదారుల వాహనాలకు పర్మినెంట్ డీఎల్, ఆర్‌సీలకు చలానాలు కట్టించుకునే సమయంలోనే పర్మినెంటు కార్డులకు కూడా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.210 వసూలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు 300 డీఎల్, ఆర్‌సీలు జారీ చేస్తుంటారు. ఈ లెక్కన ప్రతిరోజూ రూ.63 వేలను రవాణాశాఖ ద్వారా వాహనదారులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. నెలకు సుమారు రూ.18.90 లక్షలు కడుతుండగా, సంవత్సరానికి రూ.2,26,80,000 చెల్లిస్తున్నారు. గడచిన రెండేళ్ల కాలంలో సుమారు రూ.4,53,60,000 వాహనదారులు ప్రభుత్వానికి చెల్లించారు. అయితే కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో వాహనదారులు నానాతిప్పలు పడి వివిధ ప్రైవేటు వెబ్‌సైట్లలోకి వెళ్లి డూప్లికేట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకుని వాడుకుంటున్నారు. లారీల డ్రైవర్లు, యజమానులు ఇతర రాష్ట్రాలకు బాడుగలకు వెళ్లినప్పుడు ఆ రాష్ట్ర రవాణా, పోలీసుశాఖ అధికారులు ఒరిజినల్ ఆర్‌సీలను, డీఎల్‌లను అడుగుతుండటంతో అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. తమ వద్ద ముక్కుపిండి డబ్బులు వసూలు చేసిన అధికారులు కార్డులు ఇవ్వలేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లిఅడిగితే డిజిటల్ ప్రింట్ తీసుకోవాలి ఉచిత సలహా ఇస్తున్నారని, ఈ ప్రింట్లను ఇతర రాష్ట్రాల్లో చూపితే ఒప్పుకోవడం లేదని దీంతో కాళ్లా వేళ్లా పడి బయటకు వస్తున్నామని పలువురు డ్రైవర్లు తెలిపారు. ఇప్పటికై నా తమకు ఒరిజినల్ డీఎల్‌లు, ఆర్‌సీలు ఇవ్వాలని కోరుతున్నారు.


