ఏసీబీ అధికారులమంటూ డబ్బుల వసూలు | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ అధికారులమంటూ డబ్బుల వసూలు

May 31 2026 1:18 AM | Updated on May 31 2026 1:18 AM

ఏసీబీ అధికారులమంటూ డబ్బుల వసూలు పొగాకు గోడౌన్‌గా సచివాలయం ! ఫీడర్‌ కెనాల్‌ పరిశీలన

ఫోన్‌కాల్‌ బెదిరింపుతో వీఆర్‌వో నుంచి రూ.1.5 లక్షలు వసూలు

బల్లికురవ: ఏసీబీ అధికారులం అంటూ శనివారం మండలంలోని వీఆర్‌వోలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మోసగాళ్లు ఫోన్‌ల ద్వారా మెసేజ్‌లతో బెదిరింపులకు పాల్పడ్డారు. మండలంలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ వీఆర్‌వో మోసగాళ్ల బెదిరింపులకు భయపడి గంటల వ్యవధిలో రూ.1.5 లక్షలను బంధువుల నుంచి తెచ్చి వారి ఖాతాలకు జమచేశాడు. మీ అవినీతి చిట్టా తమ వద్ద ఉందని..అడిగినంత ముట్టచెప్పకపోతే మీ పాపాలపై కేసులు నమోదుతో రికవరీ చేస్తామని మోసగాళ్లు పలువురు వీఆర్‌వోలు, గ్రామపంచాయతీ కార్యదర్శులను బెదిరించినట్లుగా మండల స్థాయి అధికారుల దృష్టికి తెచ్చారు. మండలంలో గత రెండేళ్లలో అవినీతి తీవ్రస్థాయిలో జరిగింది. దాన్ని ఆసరాగా తీసుకుని మోసగాళ్లు ఒకేరోజు పదిమంది వరకు బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై తహసీల్దార్‌ రవినాయక్‌ మాట్లాడుతూ సైబర్‌ మోసగాళ్ల బారిన పడవద్దన్నారు. ఎవరైనా ఫోన్‌ బెదిరిస్తే తనకు సమాచారం ఇవ్వాలని కోరారు.

● సచివాలయంలో ఎండు పొగాకు వేసుకున్న టీడీపీ నాయకుడు

పీసీపల్లి: ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేయడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయాలను నిర్మిస్తే ప్రభుత్వం మారాక టీడీపీ నాయకులు వాటిని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ప్రభుత్వ భవనాలను తమ సొంత ఆస్తుల్లా ఉపయోగించుకుంటున్నారు. మండల పరిధిలోని చింతగుంపల్లి సచివాలయంలో రెండేళ్ల నుంచి ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, బూత్‌ యూనిట్‌ ఇన్‌చార్జ్‌ ప్రసాద్‌ సర్పంచ్‌ గదిలో దర్జాగా ఎండు పొగాకు నిల్వ ఉంచుకున్నాడు. ఒకరిద్దరు అధికారులు పొగాకును ఖాళీ చేయండి అని సిబ్బందిని అడగగా, వారిని సైతం బెదిరిస్తూ దర్జాగా తన సొంత ఇంటిలాగా టీడీపీ నాయకులు వాడుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సచివాలయ భవనంలో నిల్వ ఉంచిన పొగాకును తొలగించి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

పెద్దదోర్నాల: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్‌ కెనాల్‌కు సంబంధించి పెద్దదోర్నాల మండల పరిధిలో చేస్తున్న పనులను ఇరిగేషన్‌ సీఈ రమేష్‌, ఎస్‌ఈ, అబూతాలిం శనివారం పరిశీలించారు. లైనింగ్‌, రిటైనింగ్‌ వాల్‌ పనుల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో పనుల పురోగతి తదితర విషయాలపై అధికారులతో చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement