విచారణ జరపాలి | - | Sakshi
Sakshi News home page

విచారణ జరపాలి

May 30 2026 8:29 AM | Updated on May 30 2026 8:29 AM

డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలి

మెరిట్‌ లిస్ట్‌ కాకుండా వ్యక్తిగత మెసేజ్‌లు పంపడం సరికాదు స్పోర్ట్స్‌ కోటా పేరుతో ఒక్కో పోస్టును రూ.15 లక్షలకు అమ్ముకున్నారు నిరుద్యోగులను మోసం చేస్తున్న చంద్రబాబు, లోకేష్‌ వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

డీఎస్సీ అక్రమాలపై

ఒంగోలు సిటీ: అక్రమాల డీఎస్సీని రద్దు చేసి, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పార్టీ పిలుపు మేరకు వైఎస్సార్‌ సీపీ జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంబేడ్కర్‌ భవనం నుంచి పార్టీ నాయకులు, అభిమానులు, నిరుద్యోగులతో కలసి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు, లోకేష్‌ ఆధ్వర్యంలో దగా డీఎస్సీ నిర్వహించి లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేశారని బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2025 డీఎస్సీ లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఏళ్ల తరబడి నిరీక్షించిన అభ్యర్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. మెరిట్‌ లిస్ట్‌ను బహిర్గతం చేయకుండా వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన ధ్వజమెత్తారు. మీ మనుషులకు, మీ పార్టీ వారికి, పచ్చ జెండా పట్టుకున్న వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని బూచేపల్లి ఆరోపించారు. చదువుకున్న నిరుద్యోగుల పొట్ట కొట్టారని విమర్శించారు. టెట్‌, డీఎస్సీలకు ఒకే కన్వీనర్‌ను నియమించడం వెనుక మతలబేంటని నిలదీశారు. సోర్ట్స్‌ కోటాను పెంచి పోస్టులను అమ్ముకున్నారని ఆరోపించారు. స్సోర్ట్స్‌ కోటా అర్హత లేని వారికి ఒక్కో పోస్టును రూ.15 లక్షలకు బేరం పెట్టి వసూలు చేయడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై కోర్టులకు వెళ్లాలనుకున్న వారిపై కేసులు పెడతామని బెదిరించారన్నారు. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు, లోకేష్‌లు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక మార్కెట్లో కూరగాయలు అమ్మినట్లుగా ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన వారికి న్యాయం చేయాలన్నారు.

మహానాడు పెద్ద బోగస్‌..

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు పెద్ద బోగస్‌, పెద్ద డ్రామా అని బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ నుంచి మిగిలిన హామీల అమలుపై మహానాడులో ఏమైనా చర్చించారా అని ఆయన ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాలు, నిరుపేదలకు సెంటు భూమి, 18 ఏళ్లు నిండిన ఒక్క మహిళకై నా రూ.1500 ఇచ్చారా? ఉద్యోగాలు ఇవ్వకుండా, హామీలు నెరవేర్చకుండా మహానాడు సక్సెస్‌ అంటూ భజన చేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే ప్రజలు మీపై తిరగబడతారని బూచేపల్లి హెచ్చరించారు.

నైతిక బాధ్యత వహించి లోకేష్‌ రాజీనామా చేయాలి: చుండూరి రవిబాబు

గతంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష పేపరు లీకై తే మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారని, మీరు ఏమాత్రం సిగ్గు పడకుండా డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారని మంత్రి లోకేష్‌ను ఉద్దేశించి ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు విమర్శించారు. మీ తాబేదార్లకు రూ.15 లక్షలకు పోస్టులు అమ్ముకొని, అర్హులైన పేదవారికి అన్యాయం చేశారని, ఇది సిగ్గుమాలిన చర్య అని ధ్వజమెత్తారు. లోకేష్‌కు ఏమాత్రం నిబద్ధత ఉన్నా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్‌బాబు, ఒంగోలు అసెంబ్లీ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహా గౌడ్‌, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు శేషారెడ్డి, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, ఎస్టీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షురాలు పేరం ప్రసన్న, స్టేట్‌ స్టూడెంట్‌ వింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నారాయణరెడ్డి, ఒంగోలు, దర్శి, మార్కాపురం, కొండపి, కనిగిరి, సంతనూతలపాడు నియోజకవర్గ స్టూడెంట్‌ వింగ్‌ అధ్యక్షులు వరుసగా శ్రీకాంత్‌, వెంకు, మహేంద్ర, సంజీవ్‌రెడ్డి, సునీల్‌, మహేంద్రరెడ్డి, ఎస్కే. అరిఫా, స్టేట్‌ జనరల్‌ సెక్రటరీ రవి, ప్రవీణ్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు సీఎం వెంకటేశ్వరరెడ్డి, పల్నాటి వెంకటేశ్వర్లు, చెంచురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement